AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పొరపాటున వేరే రైలెక్కిన మహిళ.. ఇంతలోనే ఎంత ఘోరం.. కన్నీళ్లు తెప్పించే విషాదం

అమ్మా! పొరపాటున వేరే రైలు ఎక్కి ఎక్కడికో వచ్చాను, మళ్లీ ట్రైన్ మారి రాత్రికి మన ఊరు వచ్చేస్తా, నువ్వు కంగారు పడకు అని ఫోన్ చేసినా కొద్ది నిమిషాల్లోనే హృదయ విధాల ఘటన చోటు చేసుకుంది. ఇంతకీ ఆ కొద్ది నిమిషాల్లో ఏమైంది..

Andhra Pradesh: పొరపాటున వేరే రైలెక్కిన మహిళ.. ఇంతలోనే ఎంత ఘోరం.. కన్నీళ్లు తెప్పించే విషాదం
old lady died of heatwave
Gamidi Koteswara Rao
| Edited By: Basha Shek|

Updated on: May 10, 2025 | 10:28 PM

Share

పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం తోటవలస గ్రామానికి చెందిన సంతోషి భర్త గత మూడు నెలల క్రితం అకస్మాత్తుగా చనిపోయాడు. భర్త మృతితో మనస్తాపం చెందిన సంతోషి గత కొద్ది రోజులుగా అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ క్రమంలోనే మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజిహెచ్ ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుని అక్కడ నుంచే చికిత్స పొందుతుంది. అందులో భాగంగా సంతోషి ఎప్పటిలాగే తన గ్రామం నుండి బయలుదేరి విశాఖ చేరుకుంది. అక్కడ చికిత్స పొందిన తరువాత తిరిగి ఇంటికి వచ్చేందుకు రైల్వేస్టేషన్ కి చేరుకుంది. అక్కడ టిక్కెట్ తీసుకుని విశాఖ నుండి పార్వతీపురం వెళ్ళేందుకు ట్రైన్ ఎక్కింది. అయితే ఆమె రాయగడ ఎక్స్ ప్రెస్ ఎక్కి తన గ్రామానికి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ లో దిగాలి. అయితే సంతోషికి అవగాహన లేకపోవడంతో రాయగడ ఎక్స్ ప్రెస్ ఎక్కబోయి ప్రక్కనే ఉన్న వేరొక ట్రైన్ ఎక్కి కూర్చుంది. కొంతసేపటి తర్వాత విజయనగరం రావాల్సిన ట్రైన్ తునిలో ఆగింది. దీంతో తాను పొరపాటున వేరే ట్రైన్ ఎక్కానని గమనించి వెంటనే తునిలో ట్రైన్ దిగింది. వెంటనే సంతోషి తన తల్లికి ఫోన్ చేసి అమ్మా పొరపాటున బొబ్బిలి రావలసిన రాయగడ ఎక్స్ ప్రెస్ ఎక్కబోయి వేరే ట్రైన్ ఎక్కాను, ప్రస్తుతానికి తుని స్టేషన్ లో దిగాను. తిరిగి రాత్రికి ఏ సమయం అయినా ఇంటికి వస్తాను, తాను ఇంటికి వచ్చేవరకు కొడుకు జాగ్రత్త అని చెప్పింది. సరే అమ్మ జాగ్రత్తగా ఇంటికి రమ్మని చెప్పి ఫోన్ పెట్టేసింది సంతోషి తల్లి.

అలా తల్లితో మాట్లాడిన కొద్ది క్షణాల్లోనే సంతోషి ట్రైన్ ట్రాక్ దాటుతుండగా ట్రాక్ పై వస్తున్న మరొక రైలు ఆమెను ఢీకొట్టింది. ఈ ఘటనలో సంతోషి అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే సంతోషి పరిస్థితి గమనించిన రైల్వే సిబ్బంది సంతోషి తల్లికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. సంతోషి మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. భర్త చనిపోయిన మూడు నెలలకి సంతోషి కూడా ట్రైన్ యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోవడంతో వారి తొమ్మిదేళ్ల ఏళ్ల కుమారుడు ఒంటరి వాడయ్యాడు. తన కుమార్తె మరణవార్త విని సంతోషి తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ కలిచివేస్తుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..