ఉత్తరాంధ్ర ఆత్మగౌరవం ప్రధాన ఎజెండాగా గర్జన చేపట్టింది జేఏసీ. శ్రీకృష్ణ, శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టుల ఆధారంగా.. ఉత్తరాంధ్ర వెనుకబాటును ప్రస్తావిస్తోంది జేఏసీ. అమరావతిని రాజధానిగా తాము అంగీకరించినప్పుడు.. విశాఖను రాజధానిగా ఎందుకు అంగీకరించరని ప్రశ్నిస్తున్నారు. రాయలసీమకూ న్యాయం జరగాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది. సీమ, కోస్తా నాయకులనూ జేఏసీ ఆహ్వానిస్తోంది. సమైక్యంలో సమన్యాయం ఉండాలనే నినాదంతో విశాఖ గర్జించింది. భవిష్యత్‌లో సమస్యలు రాకుండా ఉండాలంటే.. మూడు రాజధానులే పరిష్కారమని జేఏసీ భావిస్తోంది. వర్షం ఆపలేకపోయింది. దూరాభారాలూ లెక్కచేయలేదు. దశాబ్దాల వెనుకబాటుదనం దహించేస్తుంటే. మండే గుండెలు ఉద్యమజెండా పట్టాయ్. రాజధాని సంకల్పంతో ఉక్కు పిడికిలి బిగించాయ్. పాలనా రాజధానిగా విశాఖనే ఉండాలంటూ వేల గొంతులు నినదించాయ్. పాదం పాదం కలిపి ర్యాలీగా కదిలాయ్. విశాఖ తీరం జన సంద్రాన్ని తలపించింది. అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి.. బీచ్‌రోడ్డులోని YS విగ్రహం దగ్గరకు ర్యాలీ జరిగింది. పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు పలువురు కీలక నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వేలాదితో తరలివచ్చిన జనంతో విశాఖ బీచ్ రోడ్డు కిక్కిరిసిపోయింది.
విశాఖ గర్జనకు కోస్తా, రాయలసీమ ప్రాంతానికి చెందిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు కూడా జైకొట్టారు. ఉత్తరాంధ్రవైపు చూడాలంటేనే చంద్రబాబు భయపడాలన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. పెట్టుబడిదారుల కోసం ఉద్యమాలు ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబుకు పదవిపైన, కుమారుడిపైనే ప్రేమ ఉంటుందన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటను రూపుమాపేందుకే విశాఖ రాజధాని అన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యమన్నారు. ఆస్తుల సంపాదనే చంద్రబాబు ధ్యేయమని ఆరోపించారు. మహిళలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. విశాఖకు రాజధానిని సాధించేందుకు ఎంతవరకైనా పోరాడతామన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. విశాఖలో అరిస్తే అమరావతికి వినపడాలన్నారు. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాజధాని కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. రాజధానిపై పవన్ తీరు దురదృష్టకరమన్నారు మంత్రి రోజా. పవన్‌కు పాలిటిక్స్, యాక్టింగ్‌లకు విశాఖ కావాలి రాజధానిగా అవసరం లేదా అని ప్రశ్నించారు. తాము చేసేది ప్రజా పోరాటమనీ.. చంద్రబాబు చేసేది రియల్ ఎస్టేట్ పోరాటమని ఆరోపించారు మంత్రి రోజా.
పాదయాత్ర పేరుతో ఉత్తరాంధ్రపై అమరావతి రైతులు దండయాత్ర చేస్తున్నారని జేఏసీతో పాటు ఉత్తరాంధ్ర నేతలు ఆరోపించారు. దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ఎంతో వెనుకబాటుకు గురైంది. ఇంకా నష్టపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..