Vizag Road Accident: విశాఖలో రాత్రంతా వీధుల్లో పోలీసులు పహారా కాశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా పెట్టారు. అంతా అనుకున్న ప్రకారమే.. నగరంలో ఎలాంటి ఘటనలు జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం ఐదు గంటల వరకు రోడ్లపై ఆంక్షలు సడలించారు. ఇంతలోనే ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కొత్త సంవత్సరం తొలిరోజే విశాఖలో ముగ్గురు యువకుల ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. ఆరిలోవ బిఆర్టిఎస్ రోడ్డులో ఈ రోడ్డు ప్రమాదం ప్రమాదం జరిగింది. వేపగుంట ప్రాంతానికి చెందిన నితీష్, మోహన్ వంశీ.. ఓ బైక్ పై హనుమంతవాక వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆదర్శనగర్ కు చెందిన రాకేష్, రాంబాబు మరో బైక్‌పై హనుమంతవాక నుంచి అడవివరం వైపు వెళుతున్నారు.
ఈ క్రమంలో రెండు ద్విచక్ర వాహనాలు బిఆర్టిఎస్ రోడ్ లోని అపోలో హాస్పిటల్ ప్రాంతానికి వచ్చేసరికి.. ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే నితీష్, రాకేష్, రాంబాబు ప్రాణాలు కోల్పోయారు. మోహనవంశీ తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరాడు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. వాహనాల ఆధారంగా నిందితులను గుర్తించి వారి బంధువులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ ప్రమాదంతో మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Also Read: