‘3 సార్లు ఫెయిల్.. నాకు IAS ఎందుకు రాదు?’.. UPSC టాపర్ కృష్ణ తేజ IAS సాధనలో అసలు సీక్రెట్ ఇదే!
పదో తరగతి నుంచి ఇంజినీరింగ్ వరకు టాపర్.. ఆ తర్వాత సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. సివిల్ సర్వీసెస్‌పై పెద్దగా అవగాహన లేకపోయినా స్నేహితుడి ప్రోత్సాహంతో ఆ దిశగా అడుగులు.. వరుసగా మూడుసార్లు వైఫల్యం. అయినా వెనక్కి తగ్గకుండా తన లోపాలను గుర్తించి, క్రమశిక్షణతో సాధన చేసి చివరకు ఐఏఎస్‌గా విజయం సాధించారు కృష్ణ తేజ. 2015 యూపీఎస్సీలో 66వ ర్యాంకుతో సత్తా చాటారు. తన సివిల్స్ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో ఆయన పంచుకున్నారు..

ఇంజినీరింగ్ పూర్తి చేసిన కృష్ణ తేజ కొంతకాలం సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేశారు. అప్పట్లో సివిల్ సర్వీసెస్ అంటే తనకు పెద్దగా అవగాహన లేదని చెప్పారు. అయితే తన స్నేహితుడు సివిల్స్‌పై ఆసక్తితో ఉండేవాడని, అతని ప్రోత్సాహంతో తాను కూడా ఈ పరీక్షకు సిద్ధమవ్వడం ప్రారంభించానని తెలిపారు. సరైన అవగాహన లేకపోవడంతో ప్రారంభంలో కొన్ని వైఫల్యాలు ఎదురయ్యాయని చెప్పారు. పరీక్ష ఎలా ఉంటుంది? ఏం చదవాలి? ఎలా ప్రిపేర్ అవ్వాలి? అనే విషయాలపై స్పష్టత లేకపోవడం తనకు ఇబ్బందిగా మారిందన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఇంజినీరింగ్‌లో తాను టాపర్‌గా ఉండేవాడినని కృష్ణ తేజ తెలిపారు. వరుస విజయాల కారణంగా తనలో తెలియకుండానే ‘‘నేను బాగా చదువుతాను’’ అనే చిన్నపాటి ఈగో ఏర్పడిందని చెప్పారు. అదే నమ్మకంతో సివిల్స్ పరీక్ష రాశానని, కానీ వరుసగా మూడు ప్రయత్నాల్లోనూ విజయం సాధించలేకపోయానని తెలిపారు. మూడుసార్లు విఫలమైన తర్వాత తనలోని తప్పులను తానే గుర్తించేందుకు ప్రయత్నించినా ఏ లోపం కనిపించలేదన్నారు. స్నేహితులను కూడా అడిగానని, అయితే ‘‘నువ్వు బాగా చదువుతావు కదా.. నీకు ఎందుకు రాదు?’’ అనే సమాధానమే ఎక్కువగా వచ్చేదని వివరించారు.
‘నాకు IAS రాదేమో’ అనుకున్న సమయంలో..
మూడు ప్రయత్నాలు విఫలమైన తర్వాత సివిల్స్ ప్రిపరేషన్ వదిలేసి తిరిగి సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి వెళ్లిపోవాలని కృష్ణ తేజ నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని తన స్నేహితులకు ఫోన్ చేసి చెప్పారట. ఈ విషయం తనను ఇష్టపడని వారికి కూడా తెలిసిందని, మరుసటి రోజు ఉదయమే వారు తన గదికి వచ్చి ‘నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు.. నీకు IAS రాదు. IT ఉద్యోగమే నీకు సరైనది’ అంటూ అభినందించారని గుర్తు చేసుకున్నారు. అయితే వారి మాటలు తనకు కోపం తెప్పించినా, ఆ సమయంలో ఒక ముఖ్యమైన ప్రశ్న తనలో మొదలైందన్నారు. ‘సరే.. నాకు IAS రాదు. కానీ నాకు ఎందుకు IAS రాదు?’ ఈ ప్రశ్నకు తనను విమర్శించిన ముగ్గురు వ్యక్తులు మూడు కారణాలు చెప్పారని కృష్ణ తేజ తెలిపారు.
శత్రువులు చెప్పిన మూడు లోపాలు
- మొదటిగా తన చేతిరాత అంత బాగుండదని చెప్పారన్నారు. సివిల్స్ మెయిన్స్‌లో వేల మార్కుల పరీక్ష రాయాల్సి ఉంటుందని, చేతిరాత కూడా ముఖ్యమని సూచించారని తెలిపారు.
- రెండో లోపంగా తన సమాధానాలు చాలా పాయింట్ టు పాయింట్‌గా ఉంటాయని చెప్పారన్నారు. పరీక్షలో కేవలం పాయింట్లు రాయడం కాకుండా, సమాధానంలో ఒక ఫ్లో, కథన శైలి ఉండాలని సూచించారని వివరించారు.
- మూడోది.. తాను ప్రశ్నకు చాలా సూటిగా, క్లుప్తంగా సమాధానం చెబుతానని, అయితే సివిల్స్ ఇంటర్వ్యూలో మరింత డిప్లొమాటిక్‌గా, కన్విన్సింగ్‌గా సమాధానం చెప్పే నైపుణ్యం అవసరమని వారు సూచించారని తెలిపారు.
ఆ మూడు లోపాలు తనకూ నిజమే అనిపించాయని కృష్ణ తేజ చెప్పారు.
‘ఫ్రెండ్స్ నుంచి పాజిటివ్స్.. ఎనిమీస్ నుంచి నెగెటివ్స్’
తన శత్రువులు గుర్తించిన లోపాలే తనకు ఎంతో ఉపయోగపడ్డాయని కృష్ణ తేజ తెలిపారు. ‘నాలో పాజిటివ్స్ తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్‌ను అడగాలి. నాలో నెగెటివ్స్ తెలుసుకోవాలంటే శత్రువులను అడగాలి’ అనే జీవిత పాఠాన్ని అక్కడే నేర్చుకున్నానని చెప్పారు. ఎదగాలంటే మన లోపాలను నిజాయితీగా చూపించే వ్యక్తులను గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. తన సివిల్స్ ప్రిపరేషన్‌లో బాలలత మేడం అందించిన మార్గదర్శకత్వం కీలకమని కృష్ణ తేజ తెలిపారు. ఆమె వద్ద చేరిన తర్వాత ప్రతిరోజూ తెల్లవారుజామునే వెళ్లి మూడు గంటల పరీక్ష రాయాల్సి వచ్చేదని చెప్పారు. రోజూ ఉదయం 4:30 గంటలకు అక్కడ ఉండాల్సి ఉండేదని, ఏదైనా రోజు పరీక్షకు రాకపోతే శిక్షణను ఆపేస్తానని ఆమె స్పష్టంగా చెప్పారని గుర్తు చేసుకున్నారు. దాదాపు 365 రోజుల పాటు పరీక్షలు రాసి, వాటన్నింటినీ ఒక పుస్తకంగా తయారు చేసి ఆమెకు ఇచ్చానని తెలిపారు. ఈ సాధన తనలో నిరంతర కృషి, క్రమశిక్షణ, స్థిరత్వాన్ని పెంచిందన్నారు.
‘IAS అధికారికి కావాల్సింది కన్సిస్టెన్సీ’
IAS కావాలంటే కేవలం ప్రతిభ సరిపోదని, కన్సిస్టెన్సీ ఎంతో ముఖ్యమని కృష్ణ తేజ అభిప్రాయపడ్డారు. ‘ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఓపికగా, నైపుణ్యంతో నిరంతరం కొనసాగిస్తేనే అది నిలబడుతుంది. ఏడాది పాటు ప్రతిరోజూ పరీక్షలు రాయడం ద్వారా ఆ అలవాటు నాలో ఏర్పడింది’ అని వివరించారు. రోజూ ఉదయం 3 గంటలకే నిద్రలేచి, అరగంట పరీక్షకు సంబంధించిన విషయాలను రివైజ్ చేసుకుని, మరో అరగంటలో సిద్ధమై పరీక్షకు వెళ్లేవాడినని తెలిపారు. తన విజయానికి మొదటి క్రెడిట్ తన తల్లిదండ్రులు, సోదరికి దక్కుతుందని కృష్ణ తేజ చెప్పారు. అనంతరం తనకు మార్గనిర్దేశం చేసిన బాలలత గారు, స్నేహితుడు హరిప్రసాద్, తన కజిన్ నరేంద్రనాథ్‌కు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సివిల్ సర్వీసెస్‌లో విజయం సాధించిన తర్వాత తనకు కేరళ కేడర్ లభించిందని చెప్పారు. కేడర్ ఎంపికలో కేరళ తన ఆరవ ఆప్షన్‌గా ఉందని తెలిపారు. ఆ సమయంలో ఖాళీలు తక్కువగా ఉండటంతో కేరళ కేడర్ వచ్చిందని, అయితే అది మంచి కేడర్ అని పేర్కొన్నారు.
వైఫల్యాల నుంచి విజయానికి..
కృష్ణ తేజ ప్రయాణం చూస్తే సివిల్స్‌లో విజయం సాధించడానికి కేవలం ప్రతిభ మాత్రమే కాకుండా, తప్పులను గుర్తించడం, విమర్శలను స్వీకరించడం, నిరంతర సాధన, క్రమశిక్షణ కూడా కీలకమని ఆయన అనుభవాలు చెబుతున్నాయి. మూడుసార్లు వైఫల్యం ఎదురైనా.. నాలుగో ప్రయత్నంలో IAS సాధించిన కృష్ణ తేజ కథ, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు పట్టుదల, ఆత్మపరిశీలన, స్థిరమైన సాధన ప్రాధాన్యతను గుర్తుచేస్తోంది.




