Ashok Gajapathi Raju – MANSAS – Sanchaita – Vijayasai Reddy : ఇన్నాళ్లూ భూములు, స్కాముల చుట్టు తిరిగిన ఏపీ రాజకీయలు ఇప్పుడు విజయనగరం కోట చుట్టు తిరుగుతున్నాయి. ఇందుకు మాన్సాస్ ట్రస్టు విషయాలు రచ్చ కావడమే కారణం. ఇటీవల ట్రస్టుకు సంబంధించిన అంతర్గత విషయాలు రచ్చరచ్చగా మారాయి. దీంతో ట్వీట్ వార్ స్టార్ట్ అయ్యింది. అశోక్ గజపతి రాజుకు సంచయిత గజపతి రాజు, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. వారిద్దరికీ కలిపి అశోక్ గజపతి రాజు ఇవాళ తాజా ఎన్‌కౌంటర్ ఇచ్చారు.
మాన్సాస్ ట్రస్ట్, ఉద్యోగులపై కేసు, సంచయిత, విజయసాయి ట్వీట్స్‌పై అశోక్ గజపతి తీవ్ర స్థాయిలో స్పందించారు. మాన్సాస్ ట్రస్టు ఈవోపై హైకోర్టులో, కోర్టు ధిక్కారణ కేసు వేయబోతున్నట్టు అశోక్ గజపతి రాజు స్పష్టం చేశారు. ఈవో నిర్ణయాలు కోర్టు ధిక్కారం కిందకే వస్తాయని కామెంట్ చేశారు. సిబ్బంది జీతాల సమస్య గతంలో ఎప్పుడూ లేదని చెప్పారు అశోక్ గజపతి రాజు. జీతాల చెల్లింపుని అక్కడ అధికారులు ఓ సమస్యగా భావించటం బాధాకరమని వ్యాఖ్యానించారు.
మన్సాస్ సంస్థల మనుగడ లేకుండా చేసేందుకే ఉద్యోగులకు జీతాలు ఇవ్వటంలేదని అశోక్ గజపతి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతమడిగితే ఉద్యోగులపై కేసులు పెడతారా అని ఆయన ప్రశ్నించారు. జీతం రాకపోతే ఈవో పనిచేయగలరా అని నిలదీశారు. ఈవో చర్యలు సంస్ధకు ఇబ్బందికరంగా మారాయన్న అశోక్ గజపతి రాజు, బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసే ముందు తనకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. మాన్సాస్ చైర్మన్ గా తాను అడిగిన సమాచారం కూడా ఇవ్వటం లేదని అసహనం వ్యక్తం చేశారు.
ఇటీవల ట్రస్టు ఉద్యోగులు జీతాల కోసం విజయనగరం కార్యాలయం ఎదుట ఆందోళన చేసి ఈవోను నిర్బంధించిన విషయం తెలిసిందే. అయితే నిర్బంధంపై ఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతమంది ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై అశోక్ గజపతి రాజు సీరియస్ అయ్యారు. ఎంపీ విజయసాయి రెడ్డి ప్రధానికి రాసిన లేఖ అర్థరహితమని కొట్టిపారేశారు అశోక్ గజపతి రాజు. తాను ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్న సమయంలోనే కూనేరు రైలు ప్రమాదం జరిగిందని వివరించారు. ఎంక్వైరీకి తనకు ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు.