సింహాచలం అప్పన్న దర్శనానికి డ్రెస్ కోడ్.. ఈ దుస్తులతో వస్తే నో ఎంట్రీ.. డిసెంబర్ నుంచే కొత్త నిబంధనలు!
Simhachalam Temple Dress Code: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో డిసెంబర్ 1 నుండి డ్రెస్ కోడ్ అమలవుతుంది. భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించడం తప్పనిసరి. టీషర్టులు, జీన్స్, స్లీవ్‌లెస్ వంటి ఆధునిక వస్త్రధారణతో వచ్చే వారికి ప్రవేశం ఉండదు. ఆలయ పవిత్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పురుషులు ధోతీ, మహిళలు చీర వంటి సాంప్రదాయ వస్త్రాలు ధరించాలి.

Simhachalam Temple Dress Code: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు ఇకపై సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుంది. టీషర్ట్స్, జీన్స్, స్లీవ్ లెస్తో వస్తే స్వామివారి ఆలయంలోకి ఎంట్రీ ఉండదు. సింహాచలం ఆలయంలో డ్రెస్ కోడ్ నిబంధనను అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి నిబంధన అమల్లోకి తెస్తున్నారు. ఇకపై దర్శనానికి వచ్చే పురుషులు ధోతి, పంచె, కుర్తా పైజామా, సాధారణ ప్యాంట్, షర్ట్, మహిళలు చీర, లంగా ఓణీ, దుపట్టాతో కూడిన చుడీదార్ ధరించాలి. పిల్లలు కూడా సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుంది.
విశాఖపట్నం జిల్లా సింహాగిరిపై వెలసిన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో.. క్షేత్ర పవిత్రత, ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని పరిరక్షించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానాన్ని దర్శించుకునే భక్తులందరికీ సాంప్రదాయ దుస్తుల నియమావళిని అంటే డ్రెస్ కోడ్ అమలు చేస్తున్నారు. సనాతన ధర్మ సంస్కృతి, సంప్రదాయాలు, దైవ సన్నిధి పట్ల భక్తి ప్రపత్తులను ప్రతిబింబించేలా భక్తులు ఆలయ మర్యాదలను గౌరవించేలా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎవరు ఎటువంటి దుస్తులు ధరించాలి..
శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు నిర్దేశించిన వస్త్రధారణ నిబంధనలను పాటించాలని సూచిస్తూ ప్రకటన జారీ చేశారు. స్వామివారి దర్శనానికి వచ్చే పురుషులు ధోతీతో పాటు అంగవస్త్రం గానీ, కుర్తా–పైజామా గానీ ధరించాలి. లేకుంటే.. సంప్రదాయబద్ధమైన ఫార్మల్ షర్ట్ ప్యాంట్ ధరించి ఆలయంలోనికి ప్రవేశించవచ్చు. ఇక, మహిళలు చీర, లంగావోణీ ధరించాల్సి ఉంటుంది. లేకాపోతే దుపట్టాతో కూడిన చుడీదార్లను మాత్రమే అనుమతిస్తారు. షార్ట్స్, టీ-షర్టులు, స్లీవ్‌లెస్ టాప్స్, మోడ్రన్ వెస్ట్రన్ దుస్తులు ధరించి వచ్చే భక్తులకు ఆలయ ప్రాంగణంలోనికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండదు.
నిత్య కళ్యాణం, ఆర్జిత సేవల్లోనూ..
ఇక.. సింహాచలం ఆలయంలో స్వామివారి నిత్య కల్యాణం, ఆర్జిత సేవల్లో పాల్గొనే పురుష భక్తులు తప్పనిసరిగా ధోతీ–అంగవస్త్రం లేదా సాంప్రదాయ కుర్తా–పైజామా ధరించాలి. ఆర్జిత సేవల్లో పాల్గొనే మహిళా భక్తులు చీర, లంగావోణీ లేదా తప్పనిసరిగా దుపట్టా ధరించిన చుడీదార్లతో మాత్రమే సేవలకు హాజరుకావాల్సి ఉంటుంది. చిన్నపిల్లలు కూడా సంప్రదాయబద్ధమైన దుస్తులను ధరించాలి. పెద్దలు, పిల్లలు దేవస్థానం నిర్దేశించిన నియమావళిని తప్పకుండా పాటించాలని సూచించారు ఈవో వెంకటరావు.
ఆలయ అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రమని, ఆలయ పవిత్రతను కాపాడటంలో ప్రతి ఒక్క భక్తుడూ భాగస్వామ్యం కావాలని, సిబ్బందికి, భద్రతా విభాగాలకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరుతున్నారు ఆలయ అధికారులు. దుస్తుల నిబంధనలపై భక్తులందరికీ అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేస్తున్నారు. సింహాచలం డ్రెస్ కోడ్‌పై భక్తులు స్వాగతిస్తున్నారు. నిబంధన కచ్చితంగా కఠినంగా అమలు చేయాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
డిసెంబర్ ఒకటో తేదీ నుంచి సింహాచలంలో భక్తులకు డ్రెస్ కోడ్ అమల్లోకి వస్తుంది. సింహాచలంకి స్వామి వారి దర్శనానికి వెళ్లే భక్తులు తప్పనిసరిగా.. డ్రెస్ కోడ్ నిబంధన ఉందన్న విషయాన్ని గుర్తించి.. కచ్చితంగా సాంప్రదాయ దుస్తులతోనే స్వామివారి దర్శనానికి వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తద్వారా సాంప్రదాయాన్ని.. సింహాచల క్షేత్ర పవిత్రత ఆధ్యాత్మిక ఉన్నత్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉంది.




