Thandava Reservoir : విశాఖ జిల్లా తాండవ రిజర్వాయర్ నుంచి ఆయకట్టుకు ఇవాళ నీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యేలు గణేష్, బాబూరావు, నీటిపారుదలశాఖ అధికారులతోపాటు, పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో 52 వేల ఎకరాలకు సాగు నీరు అందుతోంది.
ప్రస్తుతం రిజర్వాయర్ లో గరిష్టంగా నీటిమట్టం ఉందని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్బంగా నేతలు కోరారు. ఎత్తిపోతల పథకం పనులు పూర్తయితే తాండవ ఆయకట్టుదారులు వర్షం కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదన్నారు. దీనివల్ల విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోని రైతులకు మేలు జరుగుతుందన్నారు.
కాగా, విశాఖ జిల్లా నాతవరం మండలంలోని తాండవ జలాశయం ప్రస్తుతం నిండుకుండను తలపిస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతోపాటు, ఎగువనుంచి వచ్చిపడ్డ వరదనీటితో ప్రాజెక్టు కళకళలాడుతోంది. జలాశయ గరిష్ఠ నీటిమట్టం 380 అడుగులు కాగా ప్రస్తుతం 379 అడుగులకు నీటి మట్టం చేరింది. ఈ ఏడాది పంటకు ఎలాంటి డోకా లేదని రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.’