Coronavirus: కరోనా మహమ్మారి పేరు వింటేనే వెన్నులో వణుకు పెట్టేస్తోంది. జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ మహమ్మారి చిన్నారులను సైతం వదిలి పెట్టడం లేదు. ఇక ఏపీలో రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో దారుణం విషాదం చోటు చేసుకుంది. ఏడాదిన్నర చిన్నారి కరోనా బారిన పడి మృతి చెందడం మానవ హృదయాలను కలచివేస్తోంది. జ్వరం, దగ్గుతో బాధపడుతున్న ఓ చిన్నారికి మూడు రోజుల పాటు ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం అందించినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో అఖరి క్షణంలో చిన్నారిని కేజీహెచ్‌కు తరలించగా, అడ్మిషన్ ఇచ్చేలోగా అంబులెన్స్‌లోనే ప్రాణాలు విడిచింది. తన బిడ్డను కాపాడాలని చిన్నారి తల్లిదండ్రుల రోదన అందరిని కలచివేసింది.
విశాఖ జిల్లా అత్యుతాపురం మండలం చౌడుపల్లి గ్రామానికి చెందిన వీరబాబు సీఐఎస్‌ఎఫ్‌లో పని చేస్తున్నారు. ఇతనికి ఏడాదివయసు పాప జ్ఞానిత ఉంది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న చిన్నారికి ఈ మహమ్మారి వెంటాడింది. నాలుగు రోజుల కిందట జలుబు, జ్వరం, దగ్గు వచ్చింది. స్థానిక వైద్యుల సూచన మేరకు సన్‌రైజ్ ఆస్పత్రిలో చేర్చారు. దాదాపు లక్ష రూపాయలకు పైగా ఖర్చు అయ్యింది. ఇంకా వ్యాధి నయం కాకపోవడంతోకోవిడ్ పరీక్షలు చేయించారు. దీంతో పరీక్షల్లో చిన్నారికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో చిన్నారిని మరో కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ఆ ఆస్పత్రి వైద్యులు కేజీహెచ్‌కు తీసుకెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో చిన్నారిని పట్టుకుని కుటుంబ సభ్యులు కింగ్ జార్జి ఆస్పత్రిలో చికిత్స కోసం ప్రయత్నించగా, అఖరి క్షణంలో చిన్నారి జ్ఞానిత మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.