Vizag: వినాయక చవితి రోజు యువతి మిస్సింగ్.. ఏడాది తర్వాత వీడిన మిస్టరీ.. మతి పోయే స్కెచ్ వేసి…

|

Oct 09, 2022 | 1:58 PM

అది అమాయక గిరిజనలు ఉండే మారుమూల తండా.. అక్కడ గిరిజన యువతికి ఓ యువకుడితో పెళ్లి కుదిరింది.. ఉన్నట్టుండి ఆ యువతి ఒక్కసారిగా అదృశ్యమైంది..! ఇంతకీ ఆమెకు పెళ్లి ఇష్టం లేదా..?! లేక కాబోయే భర్త ఆమెకు నచ్చలేదా..?!

Vizag: వినాయక చవితి రోజు యువతి మిస్సింగ్.. ఏడాది తర్వాత వీడిన మిస్టరీ.. మతి పోయే స్కెచ్ వేసి...
Young Girl Missing Mystery solved
Follow us on

వాళ్ళిద్దరూ ప్రేమికులు..! ప్రియుడికి మరో యువతితో పెళ్లి సంబంధం కుదిరింది. ప్రేమించిన ప్రియుడు దూరం అవుతాడని ఆ ప్రియురాలికి అక్కసు పెరిగింది. జీవితాంతం ఇద్దరూ కలిసి ఉండాలంటే.. కాబోయే భార్యకు స్పాట్ పెట్టాలని భర్తకు సూచించింది. అందుకు తానే స్కెచ్ వేసింది. వినాయక చవితి రోజున స్పాట్ పెట్టి.. శవాన్ని ప్రియుడుతో కలిసి పాతి పెట్టింది. అది కూడా వినాయక చవితి రోజునే ముహూర్తం..! ఏడాది క్రితం అదృశ్యమైన గిరిజన యువతి కేసు మిస్టరీ మర్డర్ కేసుగా మారింది. అల్లూరి ఏజెన్సీలో.. జరిగిన ఈ ఘటన.. తీవ్ర కలకలం సృష్టించింది.  అది అల్లూరి ఏజెన్సీలో చింతపల్లి మండలం అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని సంపంగి పుట్టు. అక్కడ నివాసం ఉండే కాంతమ్మ అనే యువతికి అదే గ్రామానికి చెందిన.. వండలం గోపాల్ తో మరికొద్ది రోజుల్లో వివాహం చేయడానికి పెద్దలు నిశ్చయించారు. అందుకు ఇంట్లో వాళ్ళందరూ సిద్ధమవుతున్నారు. కాంతమ్మ కూడా తన భవిష్యత్తు జీవిత భాగస్వామితో గడిపేందుకు కలలు కంటుంది.  ఈ క్రమంలో ఒక్కసారిగా ఆమె అదృశ్యమైంది. గతేడాది వినాయక చవితి రోజు నుంచి కనిపించకుండా పోయింది. ఊరు ఊరంతా ఆమె కోసం వెతికారు. బంధువులు ఇళ్ళలో గాలించారు. ఎక్కడ కాంతమ్మ ఆచూకీ కనిపించలేదు. పండుగ పూట ఎక్కడికో వెళ్లి వచ్చేస్తుందిలే అనుకున్నారు. కానీ ఆమె ఇంటికి తిరిగి రాలేదు. రోజులు గడుస్తున్నాయి.. వారాలు గడిచాయి.. నెలలు పూర్తవుతున్నాయి.. ఏడాది కూడా గడిచింది. అయినా ఆమె ఎక్కడుందో.. ఏమైందో.. తెలియలేదు. ఈలోగా వేర్వేరు ఆలోచనలు బయటపడ్డాయి. పెళ్లికి ముందు ఇలా కాంతమ్మ అదృశ్యం కావడంతో.. ఆమెకు పెళ్ళంటే ఇష్టం లేదా..? లేక గోపాల్ ను పెళ్లి చేసుకోవడం ఆమె ఇష్టపడడం లేదా..? అనే అనుమానాలు తలెత్తాయి.

ఈ క్రమంలో కాంతమ్మ తల్లి నారాయణమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రోజులు నెలలు గడుస్తున్న ఆమె ఆచూకీ తెలియకపోవడంతో.. పోలీసులు అన్ని కోణాల్లో వెరిఫై చేశారు. కానీ కాంతమ్మ అదృశ్యంపై పోలీసులకు ఎలాంటి క్లూ లభించలేదు. దీంతో ఇక చివరి ప్రయత్నంగా.. కాంతమ్మను పెళ్లి చేసుకోవాలనుకున్న గోపాల్ గురించి ఆరా తీశారు. కాంతమ్మ అదృశ్యమైన తర్వాత కొన్నాళ్లపాటు గ్రామంలో ఉన్న గోపాల్.. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అతని కోసం గాలించడం ప్రారంభించారు. గోపాల్ కుటుంబ సభ్యులను ఎంక్వైరీ చేశారు. ఎక్కడికి వెళ్లాడో తమకు తెలియదని వాళ్లు ఆన్సర్ ఇచ్చారు. కనీసం ఫోన్ కాంటాక్ట్ కూడా లేదు. కూపి లాగిన పోలీసులకు.. గోపాల్ లవ్ స్టోరీ తెరపైకి వచ్చింది. కాంతమ్మతో వివాహం కుదరక ముందు ఐదేళ్ల నుంచి.. పొరుగు గ్రామమైన చిట్టం పుట్టు కు చెందిన కోరాబు లక్ష్మితో ప్రేమాయణం నడుస్తోంది. అయితే ఆమె కోసం ఆరా తీసిన పోలీసులకు.. గోపాల్ కనిపించకుండా పోయినప్పటి నుంచి.. లక్ష్మి కూడా గ్రామంలో లేదని తెలుసుకున్నారు. వాళ్ళిద్దరి ఆచూకీ కోసం.. గాలింపు ముమ్మరం చేశారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఏజెన్సీ వ్యాప్తంగా జల్లెడ పడ్డారు. పోలీస్ స్టేషన్లో అందరికీ అలర్ట్ చేశారు. కానీ ఎక్కడ వారి ఆచూకీ కనిపించలేదు. ఎందుకంటే ఎవరికి అనుమానం రాకుండా.. ఎవరి కంటా పడకుండా ఇద్దరు కలిసి చెక్కేసారు.

– అల్లూరు జిల్లా ఎస్పీ సతీష్.. ఈ కేసు పై ప్రత్యేకంగా అదృష్ట సారించి కేసు మిస్టరీ చేదించాలని ప్రత్యేక సూచనలు జారీ చేశారు. దీంతో కూపి లాగుతున్న పోలీసులకు.. గోపాల్ రాజమండ్రి ప్రాంతంలో.. ఆలమూరులోని చేపల చెరువులో పనిచేస్తున్నట్టు సమాచారం అందింది. వివరాలు డెవలప్ చేసి.. వెతుక్కుంటూ అక్కడికి వెళ్లారు పోలీసులు. గోపాల్ ని పట్టుకొని ప్రశ్నించారు.. అయితే తన ప్రేయసి లక్ష్మి కూడా అక్కడే ఉన్నట్టు గుర్తించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన స్టైల్ లో ట్రీట్మెంట్ ఇచ్చేసరికి.. అసలు విషయాన్ని కక్కారు. తానే కాంతమ్మను హత్య చేసినట్టు లక్ష్మీ పోలీసుల ముందు ఒప్పుకుంది. అందుకు తన ప్రియుడు గోపాల్ కూడా సహకరించినట్టు పేర్కొంది. ఇదే విషయాన్ని గోపాల్ కూడా అంగీకరించాడు. గత ఏడాది సెప్టెంబర్ 10వ తేదీన వినాయక చవితి రోజు కాంతమును హత్య చేసి పూడ్చిపెట్టినట్టు పోలీసుల విచారణలో బయటపెట్టారు ఈ కిల్లర్ లవర్స్ గోపాల్, లక్ష్మి.

కాంతమ్మపై లక్ష్మికి ఎందుకంత కసి..? గోపాల తో పెళ్లి కుదిరిన కాంతమ్మకు ప్రియుడితో కలిసి లక్ష్మీ ఎందుకు హత్య చేసింది..? వినాయక చవితి రోజున ముహూర్తం ఎందుకు పెట్టుకున్నారు..? సంపంగి పుట్టుకు చెందిన కాంతమ్మ శవం.. చిట్టంపుట్టలో ఎలా వచ్చింది. ఈ విషయాలపై ఆరా తీసిన పోలీసులకు.. నిర్గాంత పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి గోపాల్ కు పెళ్లి కుదరకముందు.. అతనితో పొరుగు గ్రామమైన చిట్టెంపుట్టుకు చెందిన లక్ష్మి ప్రేమాయణం నడిపేది. ఇంతలో గోపాల్ కు పెళ్లి కుదరడంతో.. లక్ష్మితో ఉన్న ప్రేమ వ్యవహారం కాంతమ్మకు తెలిసింది. గోపాల్ లక్ష్మి చనవుగా ఉంటుండడం చూసిన కాంతమ్మ.. గోపాల్ కు ఆంక్షలు పెట్టింది. లక్ష్మితో ఇక కలవద్దని సూచించింది. విషయం లక్ష్మికి తెలియడంతో.. తనను ప్రేమించి మరొకరికి ఎలా పెళ్లి చేసుకుంటావు అని ప్రశ్నించింది. ఆత్మహత్య చేసుకొని … చావుకి నువ్వే కారణమని రాసి చస్తానని గోపాల్ కు బెదిరించింది. ఇంకాస్త ముందుకెళ్లి.. నువ్వు ఓకే అంటే ఇద్దరం కలిసి.. కాంతమ్మను అడ్డు తొలగించుకుందాం అని గోపాల్ ను కోరింది లక్ష్మి. దీనికి సరే అన్నాడు ప్రియుడు గోపాల్.

వినాయక చవితి రోజే ఎందుకు..?

– అయితే గతేడాది.. ఆగస్టులోనే కాంతమ్మ హత్యకు స్కెచ్ వేశారు ఈ ఇద్దరు కిల్లర్ లవర్స్. ఎవరికి తెలియకుండా పని పూర్తి చేయాలని అనుకున్నారు. అందుకు.. లక్ష్మీ ఇంటిని ఎంచుకున్నారు. అది కూడా సెప్టెంబర్ 10వ తేదీ వినాయక చవితి రోజుకే ముహూర్తం ఖరారు చేశారు. ఎందుకంటే.. ఆరోజు గ్రామస్తులందరూ.. పూజల కోసం శివారుకు వెళ్తారు. ప్లాన్ లో భాగంగా.. చిట్టంపుట్టుకు చెందిన లక్ష్మి.. కాంతమ్మ ఉంటున్న సంపంగి పుట్టు గ్రామానికి వెళ్ళింది. అక్కడ కాంతమ్మతో కలిసింది. తాను గోపాల్ తో ప్రేమలో ఉన్నా.. నీతో పెళ్లి కుదిరింది కాబట్టి.. మీ ఇద్దరి మధ్యకు ఇక నేను రాను.. అని కాంతమ్మకు నమ్మబలికింది లక్ష్మి. ఆమె మాటల్లో పడిపోయిన కాంతమ్మ.. చెబుతున్నది నిజమేనని అనుకుంది. మాయ మాటలు చెబుతూ.. తన ఇంటికి కాంతమ్మను తీసుకెళ్లింది లక్ష్మి. లక్ష్మి మాటల వెనుక మర్మాన్ని గమనించలేకపోయిన కాంతమ్మ.. ఆమెతోపాటు ఇంటికి వెళ్లిపోయింది. లోపల కూర్చుని ఉండగా.. అక్కడ నుంచి పక్కకు వెళ్లిన లక్ష్మి.. అప్పటికే సిద్ధం చేసుకున్న.. గొడ్డలి పట్టుకొని వెనుక భాగంతో తలపై కొట్టింది. కాంతమ్మ అరిచేసరికి.. బయట కాపలాగా ఉన్న ప్రియుడు గోపాల్.. లోపలకు వెళ్లి కాంతమ్మ నోరు ముక్కు మూసాడు. ఇదే సమయంలో మరోసారి కాంతమ్మ పై ఎటాక్ చేసింది లక్ష్మి. దీంతో కాంతమ్మ అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయింది.

– ఆ తర్వాత కాంతమ్మ మృతదేహాన్ని.. లక్ష్మి ఇంటి పక్కనే పనస చెట్టు కింద దుంపల కోసం తవ్విన గోతిలో పూడ్చి పెట్టాలని ప్లాన్ చేశారు. గోతిని మరింత తవ్వి.. అందులో కాంతమ్మ మృతదేహాన్ని పెట్టి పూజ చేశారు. వినాయక చవితి రోజు కావడంతో.. గ్రామంలో ఎక్కడ అలికిడి లేదు. అందరూ ఇళ్లకు చేరుకునే లోపే.. ఈ కిల్లర్ లవర్స్ ఇద్దరూ పని పూర్తి చేసేశారు. అక్కడ నుంచి ఏమి ఎరగనట్టు ఎవరి పనిలో వాళ్ళు ఉండిపోయారు. కాంతమ్మ కనిపించకపోయేసరికి.. ఆమె తల్లి నారాయణమ్మ కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. గోపాల్ ప్రవర్తనపై అనుమానం వచ్చి… పంచాయతీ కూడా పెట్టారు. కానీ ఎక్కడా బయటపడలేదు గోపాల్. ఆ తర్వాత కొన్ని రోజులకు.. తన వ్యవహారం బయటపడుతుందేమోనని అనుకొని.. లవర్ తో కలిసి గ్రామాన్ని విడిచి పారిపోయాడు.

కాంతమ్మ అదృశ్యంపై తల్లి ఇచ్చిన ఫిర్యాదులతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన అన్నవరం పోలీసులు.. దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. చివరకు గోపాల్ కదలికలపై అరా తీసి.. అతని లవ్ స్టోరీ తెలుసుకొని.. లవర్ కూడా గ్రామంలో లేదని గ్రహించి.. వారిద్దరి కోసం ట్రాక్ చేయడం ప్రారంభించారు. చివరకు ఏడాది తరువాత… ఈ కిల్లర్ లవర్స్ పోలీసులకు చిక్కారు. పూడ్చిపెట్టిన స్థలంలో కాంతమ్మ డెడ్ బాడీని వెలికి తీశారు పోలీసులు. దీంతో కాంతమ్మ మిస్సింగ్ మిస్టరీ.. మర్డర్ గా మారిందని అన్నారు చింతపల్లి ఏఎస్‌పి శివ కిశోర్.

—-ఖాజా, వైజాగ్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..