
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. సాధారణ ప్రజలకే కాక, కీలక స్థానాల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులను కరోనా వెంటాడుతోంది. మూడు రోజుల క్రితం సీఎంవో కార్యాలయ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ మంత్రి గన్‌మెన్‌కు కరోనా సోకడం కలకలం రేపుతోంది.
తెలంగాణ మంత్రి వర్గంలో కరోనా అలజడి రేపుతోంది. మంత్రి నిరంజన్‌రెడ్డి కాన్వాయ్‌లో గన్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే, అతను మంత్రి కాన్వాయ్‌లో ఉన్నా కొద్ది రోజులుగా అతనితో ఏ ప్రైమరీ కాంటాక్టులు లేవని తెలుస్తోంది. మరోవైపు, తెలంగాణ సచివాలయంలో ఇద్దరు ఉద్యోగులకు కూడా కరోనా సోకింది. ప్రస్తుతం బీఆర్కే భవన్‌లో ఉన్న సెక్రెటేరియట్‌లో 7వ అంతస్తులో ఈ కేసులు నమోదయ్యాయి. ఆర్థికశాఖలో పని చేసే ఇద్దరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు వైరస్ బారిన పడ్డారు. దీంతో కొంత మంది ఆర్థిక శాఖ అధికారులు, సిబ్బందిని హోం క్వారంటైన్‌కి తరలించారు.