హీరో సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో డ్రగ్స్ అంశం కలకలం రేగింది. ఇప్పుడది టాలీవుడ్‌ను కూడా షేక్ చేస్తోంది. సినీ నటి, బీజేపీ నేత మాధవీలత కామెంట్సే దీనికి కారణం. టాలీవుడ్ సెలబ్రిటీస్ పార్టీల్లో డ్రగ్స్ వాడకం కామన్ అంటూ మాధవీలత పెట్టిన పోస్ట్ కలకలం రేపింది. దీనిపై ఎన్‌సీబీ అధికారులు, ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టాలంటూ ఆమె పోస్ట్ పెట్టారు. తాజాగా నటి కంగనా రనౌత్ కూడా బాలీవుడ్‌లో డ్రగ్స్ కల్చర్ ఉందని.. దాదాపు 90 శాతం అవి తీసుకోకుండా ఉండలేరని చేసిన కామెంట్స్‌పై ఎంత రచ్చ జరిగిందో ఇప్పుడు మాధవీలత చేసిన పోస్టుపై అంతకు మించే రచ్చ జరుగుతోంది.
తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని మాధవీలత మరోసారి స్పష్టం చేశారు. ఐదేళ్ల క్రితం తాను ఓ పార్టీ వెళ్లినప్పుడు కొందరు సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకోవడం చూశానని ఆమె చెప్పుకొచ్చారు. అప్పట్లో భయంతో ఈ విషయాలను బయట పెట్టలేకపోయానని అన్నారు. ఎందుకంటే దీని వెనుక పెద్ద మాఫియాలు ఉంటాయని మాధవీలత తెలిపారు. ఇప్పటికే భయం ఉన్నా… బాధ్యతగల సిటిజన్‌గా ఈ విషయాన్ని చెప్పాల్సి వచ్చిందన్నారు. ఇలాంటి డ్రగ్స్ కల్చర్‌ను ప్రభుత్వమే అరికట్టాలని ఆమె కోరారు.
సంచలనం కోసం తాను మాట్లాడటం లేదన్న మాధవీలత.. గతంలో తెరపైకొచ్చిన డ్రగ్స్ కేసులు ఎందుకు బలహీనపడ్డాయని ప్రశ్నించారు. అన్నీ తెలిసి డ్రగ్స్ తీసుకునేవారు బాధితులు కాదు నేరస్తులేనని అన్నారు. ఇప్పటికైనా ఎన్‌సీబీ అధికారులు టాలీవుడ్‌పై దృష్టిసారించాలని ఆమె సూచించారు. ఇటు ప్రభుత్వానికి అటు అధికారులకు ఇదే తన ఓపెన్ లేటర్ అని అన్నారు.
నటి మాధవీలత చేసిన డ్రగ్స్ ఆరోపణలపై ఎక్సైజ్ పోలీసులు స్పందించారు. టాలీవుడ్ పార్టీల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు ఆధారాలు ఉంటే తమకు ఇవ్వాలని అన్నారు. అదే సమయంలో సరైన ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. డ్రగ్స్ కేసులో ఇప్పటికే అనేక మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. మరికొంత మంది తమ నిఘాలో ఉన్నారని ఎక్సైజ్ శాఖ పోలీసులు తెలిపారు. మొత్తంగా మాధవీలత కామెంట్స్‌తో టాలీవుడ్‌లో డ్రగ్స్‌పై మళ్లీ హాట్ హాట్‌గా చర్చ నడుస్తోంది.