Vizag: గంగమ్మ కరుణించింది.. అయినా కాలం కలిసి రావట్లేదు..

మత్స్య సంపదలో రారాజు అయిన సముద్రపు రొయ్య కు ఇప్పుడు పెద్ద కష్టం వచ్చి పడింది. భారీగా వలకు చిక్కుతున్నా.. డిమాండ్ లేక ధర పడిపోతుంది. లక్షలు ఖర్చు పెట్టుకుని వేటకు వెళ్లి.. పుష్కలంగా లభించిన రొయ్యలతో ఆనందంగా ఉండాలా..? ఆ రొయ్యలకు గిట్టుబాటు ధర లేక ఏడవలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు బోటు యజమానులు. గంగమ్మ కరుణించినా.. గిట్టుబాటు ధర దయతలచక తలలు పట్టుకుంటున్నారు.

Vizag: గంగమ్మ కరుణించింది.. అయినా కాలం కలిసి రావట్లేదు..
Fisherman

Edited By: Ram Naramaneni

Updated on: Jul 07, 2023 | 6:21 PM

విశాఖ ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా 600 మేకనైజ్డ్ బోట్లు, మరో 1200 వరకు ఇంజన్ బోట్లు వేట సాగిస్తూ ఉంటాయి. ప్రతి ఏటా ఏప్రిల్ నుంచి జూన్ 14 వరకు వేట నిషేధ కాలం ఉంటుంది. ఎందుకంటే ఆ కాలంలో చేపలు, రొయ్యలు గుడ్లు పెట్టి పొదిగే కాలం. దీంతో రెండు నెలల పాటు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో బోట్లన్నీ ఒడ్డుకే పరిమితం అవుతాయి. జూన్ 14 నుంచి కొత్త సీజన్ వేటకు ప్రారంభమవుతుంది.

గంగమ్మ తల్లికి పూజలతో..

– కొత్త సీజన్ కోసం మత్స్యకారులు బోటు యజమానులంతా ఆశతో ఎదురు చూశారు. గంగమ్మ తల్లికి ప్రత్యేకంగా పూజలు చేసి… జూన్ 14 అర్ధరాత్రి నుంచి సముద్రంలో వేట మొదలుపెట్టారు. విడతల వారీగా ఫిషింగ్ హార్బర్ లో లంగర్ వేసిన బోట్లని సముద్రంలో వేటకు వెళ్లాయి. కోటి ఆశలతో వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఆ గంగమ్మ తల్లి కరుణించింది. పుష్కలంగా మత్స్య సంపద చిక్కింది. ఈసారి ఏకంగా రొయ్యల దిగుబడి ఆశాజనకంగా సాగింది.

పుష్కలంగా వలకు చిక్కిన రొయ్యలు..

– వేట కోసం సముద్రంలో వెళ్లిన కొద్ది దూరానికి రొయ్యలు పుష్కలంగా వలకు చిక్కేసాయి. ఒక్కో బోటుకు 500 కిలోల వరకు రొయ్యలు లభించాయి. బ్రౌన్, స్రింక్, వైట్, టైగర్ రకం రొయ్యలు వందల కిలోలు చిక్కేసాయి. చేపల కంటే రొయ్యలే ఈ సీజన్లో భారీగా పడడంతో ఇక మత్స్యకారులు బోటు యజమానులకు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. బోటు నిండా రొయ్యల లోడుతో ఒడ్డుకు చేరుకుంటున్నాయి బోట్లు. కానీ.. ఒడ్డుకు చేరాక కొనేవాడు కరుణించక ఫిషింగ్ హార్బర్ లో రాశులుగా రొయ్యలు కనిపిస్తున్నాయి. దీంతో మున్నెన్ననోడు లేని విధంగా రొయ్యల ధరలు భారీగా పడిపోయాయి.

కిలోకు వంద రూపాయలు పడిపోయిన పింక్ బ్రౌన్..

– పింక్ బ్రౌన్ రొయ్యలకు భారీ డిమాండ్ ఉంటుంది. గతేడాది 480 రూపాయల కిలో ధర పలికిన పింక్ బ్రౌన్ రొయ్యలు ఈ ఏడాది 350 రూపాయలకే ధర లభిస్తోంది. దీంతోపాటు గతేడాది వైట్ రకం రొయ్యలు 650 రూపాయలు కాగా… ఈ ఏడాది 450 రూపాయలు మాత్రమే ధర పలుకుతుంది. అయితే ఈసారి నాణ్యమైన పింక్ బ్రౌన్ రకం రొయ్యలు పుష్కలంగా వలకు చిక్కాయి. అయినా ఆశించని ధరరాక వ్యాపారం డీలా పడింది. ఇక గతేడాది 1100 కు పైగా ధర పలికిన టైగర్ రకం రొయ్యలు… ఈ ఏడాది కేవలం 900 రూపాయలు ధర పలుకుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బోటు ఆపరేటర్లు. ఇలాగే కొనసాగితే వాపోతున్నారు బోటు యజమాని వంక గురుమూర్తి. తమను ఆదుకునే మార్గం ప్రభుత్వం చూపాలని కోరుతున్నారు.

సుముఖత చూపని ఎగుమతి దారులు..

– ప్రధానంగా… ధరలు పడిపోవడానికి ప్రధాన కారణం దిగుబడి అయిన రొయ్యలను.. ఎక్స్పోటర్స్ కొనుగోలుకు సుముఖత చూపకపోవడమే. ఎందుకంటే భారతదేశంలో లభించే రొయ్యలకు విదేశాల్లో డిమాండ్ తగ్గడంతో పాటు.. ఆక్వా రంగంలో ఉన్న వనామి రకం రొయ్యలు కూడా ఈ సముద్రపు రొయ్యల ధరకు దెబ్బతీస్తున్నాయి. గతంలో అమెరికా యూరప్ దేశాలకు విశాఖ నుంచి రొయ్యలు ఎగుమతి అయ్యేవి. ఇప్పుడు ఈక్విడర్లో రొయ్యల దిగుబడి పెరిగిపోయింది. దీంతో ఆయా దేశాలకు రొయ్యల ఎగుమతిపై ఎఫెక్ట్ చూపించింది. మరోవైపు విశాఖ కేంద్రంగా ఉన్న 26 మంది ఎగుమతి దారుల్లో కేవలం ముగ్గురు మాత్రమే రొయ్యలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే వాళ్లకు కూడా ఆర్డర్స్ తగ్గిపోయాయని కారణంగా చెబుతున్నారు. దీంతో ఇప్పటికే భారీగా ఫిషింగ్ హార్బర్ కు చేరుకున్న రొయ్యలకు డిమాండ్ లేక భారీగా ధర పడిపోతుంది. రొయ్యలు పుష్కలంగా సముద్రంలో చిక్కుతున్నప్పటికీ… వాటికి సరైన గిట్టుబాటు ధర దాకా ఫిషింగ్ హార్బర్ లోనే నిలవ ఉండిపోతున్నాయి. దీంతో తక్కువ ధరకే అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాగే కొనసాగితే అప్పుల చేసి వేట చేసే తాము కనీస గిట్టుబాటు ధర లేక నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నాడు మరో బోటు యజమాని నూకరాజు.

ఖర్చు ఎక్కువ.. ఆదాయం తక్కువ..!

– ఒకసారి సముద్రంలో వేటకు వెళితే బోటుకు 8 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. పదిమంది సిబ్బంది డీజిల్, ఐస్ ఫిల్ చేసుకుని వేటకు వెళుతుంటాయి బోట్లు. చిక్కిన మత్స్య సంపద పైనే సిబ్బందికి జీతాలు ఆధారపడి ఉంటాయి. అయితే ప్రస్తుతం మత్స్యరాశి, రొయ్యలు పుష్కలంగా లభిస్తున్నప్పటికీ… గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆ ప్రభావం బోట్లపై ఆధారపడి ఉన్న ప్రతి ఒక్కరి పైన పడుతుందనే ఆవేదన వ్యక్తం అవుతుంది.

అధికారుల దృష్టికి సమస్య..

– ఇప్పటికే రొయ్యల గిట్టుబాటు ధర సంక్షోభంతో గగ్గోలు పెడుతున్న బోటు యజమానులు… విషయాన్ని అధికార దృష్టికి తీసుకెళ్లారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ – ఎంపేడా, ఎక్స్పోర్టర్స్ తో మాట్లాడుతున్నారు. కోవిడ్ కాలంలో… పడిపోయిన దేశీయ ఆక్వా రొయ్యలను ఎంపెడ స్వయంగా చొరవ తీసుకొని ఎగుమతులకు ప్రోత్సహించింది అని.. సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న తమకు ఈ మెరైన్ ఉత్పత్తుల ఎగుమతులు కూడా ప్రోత్సహించేలా ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు ఏపీ మెకానైజ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జానకిరామ్.

– సీజన్ ఆరంభంలోనే భారీగా రొయ్యలు చిక్కినా… గతంలో ఎన్నడూ లేనివిధంగా ధరలు భారీగా పడిపోవడం కలవరపాటుకు గురిచేస్తుంది. రానున్న రెండు మూడు నెలల్లో భారీగా మత్స్య దిగిబాడులు రానున్నాయి. ఒకవైపు పెరిగిన డీజిల్ ధరలు, ఐస్ ధరలతో ఓకే బిక్కిరి అవుతున్న బోటు యజమానులకు… గంగమ్మ తల్లి దయచూపి పుష్కలంగా మత్సరాశి లభిస్తున్నప్పటికీ.. మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు వారిని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం సంబంధిత శాఖలు చొరవ చూపకపోతే.. మెరైన్ ఉత్పత్తులు, మేలు రకం సముద్రపు రొయ్యలకు గడ్డుకాలం తప్పేలా లేదు.

మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..