విశాఖపట్నం, జనవరి 15: హైదరాబాదులో గాలిపటం మాంజా దారానికి బలై ప్రాణాలు కోల్పోయిన.. ఆర్మీ జవాన్ కోటేశ్వర్ రెడ్డికి కన్నీటి వీడ్కోలు పలికారు. విశాఖలో అంతిమయాత్రకు కుటుంబ సభ్యులు, అభిమానులు, స్థానికులు భారీగా హాజరయ్యారు. గోల్కొండ మిలటరీ హాస్పిటల్ నుంచి వచ్చిన సిబ్బంది కూడా అంతిమయాత్రలో పాల్గొన్నారు. అంతకుముందు జవాన్ కోటేశ్వర్ రెడ్డి మృతదేహానికి ఆర్మీ అధికారులు నివాళులర్పించారు. గౌరవ వందనం సమర్పించి.. సైనిక లాంచనాలతో జాతీయ జెండాను జవాన్ సతీమణికి అందించారు. జవాన్ కోటేశ్వర్ రెడ్డికి చెందిన నాలుగు తరల వాళ్లు ఆర్మీలో పని చేశారు. అదే స్ఫూర్తితో కోటేశ్వర్ రెడ్డి కూడా ఆర్మీలో చేరారు. రిపబ్లిక్ డే నాడు జన్మించారు కోటేశ్వర్ రెడ్డి. కూతురు కూడా స్వాతంత్ర దినోత్సవం నాడు పుట్టింది. ఇటీవల ఆమె తొలి పుట్టిన రోజు వేడుకలకు కూడా ఘనంగా చేశారు కోటేశ్వర్ రెడ్డి. ఆర్మీ డ్రెస్ అంటే ఎనలేని అభిమానం గౌరవం. ఆ డ్రెస్ లోనే వెళుతుండగా.. ఆర్మీ జవాన్ కోటేశ్వర్ రెడ్డి మాంజా దారానికి బలై ప్రాణాలు కోల్పోయారు. ఆర్మీ మెడికల్ కోర్ టీంలో కోటేశ్వర్ రెడ్డి నాయక్ గా పని చేస్తున్నారు. గోల్కొండ మిలటరీ హాస్పిటల్ లో నాయక్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
జవాన్ కోటేశ్వర్ రెడ్డి మృతితో ఆయన కుటుంబం కన్నీరు మున్నిరవుతోంది. భార్య తల్లిదండ్రులు, సన్నిహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆర్మీ జవాన్ కోటేశ్వర్ రెడ్డికి కన్నీటి వీడ్కోలు పలికారు. పెద్ద వాల్తేరు స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. పండుగ పూట విషాదాన్ని నింపిన కోటేశ్వర్ రెడ్డి అంత్యక్రియలకు భారీగా హాజరయ్యారు జనం. కన్నీటి వీడుకోలు పలికారు. ఏడాది పాపను ఎత్తుకొని తనకు తండ్రిని ఎవరు తీసుకొచ్చి పెడతారు అని ఆవేదనతో అంటున్న భార్య మాటలు అందరిని కలిసి వేస్తున్నాయి. డ్యూటీ నుంచి వచ్చి కాల్ రాగానే 10 నిమిషాల్లో వచ్చేస్తానని బయలుదేరారు.. దారి మధ్యలో మాంజాకు బలై ప్రాణాలు కోల్పోయారని జవాన్ భార్య ప్రత్యూష ఆవేదన చెందుతున్నారు.
ఏ తల్లికి ఇలాంటి కడుపు కోత రాకూడదని అంటోంది జవాన్ తల్లి. తాను మాట్లాడకపోతే తల్లడిల్లి పోయేవాడని.. ఇప్పుడిప్పుడే నాన్నా అని పలుకుతున్న కూతురికి తండ్రిని ఎలా తీసుకురావాలని ఆవేదనతో తల్ల డిళ్ళిపోతుంది. పండక్కి పాపను పంపుతాను చూసుకోమన్నాడు.. మాంజా దారానికి నా కొడుకు బలైపోయాడని రోదిస్తోంది ఆ తల్లి. మాంజా దారలతో ఎవరి ప్రాణాలతోనూ ఆడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్న జవాన్ తల్లి.. ఇటువంటి దారాలపై ప్రభుత్వం నిషేధం విధించాలని వేడుకుంటుంది. నాలుగు తరాలుగా దేశానికే సేవ చేసామని.. నన్ను సాగనంపాల్సిన కొడుకుకు.. నా చేతుల మీదుగా పంపాల్సి వస్తోందని తండ్రి తల్లడిల్లి పోతున్నారు. జవాన్ కోటేశ్వర్ రెడ్డి అంత్యక్రియలకు గోల్కొండ మిలటరీ హాస్పిటల్ సిబ్బంది హాజరయ్యారు. అంతిమయాత్రలో పాల్గొన్నారు. గాలిపటం దారానికి మా సహచరుని కోల్పోయాం.. చైనిస్ గాలిపటాలు నిషేధించాలని కోటేశ్వర్ రెడ్డి సహచరులు కోరుతున్నారు. దేశ సేవలో.. శత్రువుల తూటాలకు ఎదురొడ్డి నిలబడే సైనికుడు.. ఇలా మాంజా దారానికి బలైపోవడం అందరిని కలచి వేస్తుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.