Visakhapatnam: బర్త్ సర్టిఫికేట్, ఆధార్‌ కార్డులు ఇప్పించండి.. మోకరిల్లి వేడుకుంటున్న చిన్నారులు

విశాఖ జిల్లాలో గిరిజనులు ఆందోళన బాట పట్టారు. నేడుబంద గ్రామం గిరిజనులు ఆధార్ కార్డులు, జనన ధ్రువీకరణ పత్రాల కోసం నిరసన చేపట్టారు.

Visakhapatnam: బర్త్ సర్టిఫికేట్, ఆధార్‌ కార్డులు ఇప్పించండి.. మోకరిల్లి వేడుకుంటున్న చిన్నారులు
Tribals Children Protest

Edited By:

Updated on: Aug 24, 2021 | 2:08 PM

Visakha Tribal Children Protest: విశాఖ జిల్లాలో గిరిజనులు ఆందోళన బాట పట్టారు. నేడుబంద గ్రామం గిరిజనులు ఆధార్ కార్డులు, జనన ధ్రువీకరణ పత్రాల కోసం నిరసన చేపట్టారు. రెవెన్యూ రికార్డుల్లో తమ గ్రామం పేరు లేదని… అందకని ఎలాంటి ప్రభుత్వ పథకాలు తమకు అందడం లేదని వాపోతున్నారు. చివరకు పిల్లలకు బర్త్‌సర్టిఫికేట్‌ కూడా అధికారులు ఇవ్వడం లేదంటున్నారు. దీని కారణంగా చిన్నారులకు ఆధార్ రావడం లేదని… బడిలో చేర్పించేందుకు టీచర్స్‌ అంగీకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు రాకపోగా.. పిల్లలకు చదువుకునే ఛాన్స్‌ కూడా లేకుండా పోయిందంటున్నారు. అందుకే చిన్నారులు వినూత్నరీతిలో ఆందోళన చేపట్టారు. ఐటీడీఏ అధికారులు జోక్యం చేసుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

జనన ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డ్ లు ఇవ్వాలంటూ గ్రామంలో 10 ఏళ్లలోపు చిన్నారులంతా మోకాళ్ళ పై కూర్చుని నిరసన తెలిపారు. కలెక్టర్, ఐటీడీఏ అధికారులు పట్టించుకోవాలంటూ రెండు చేతులూ జోడించి చిన్నారులు వేడుకోవడం అందరినీ ఆవేదనకు గురిచేసింది. వైద్యశాలల్లో కాకుండా ఇళ్ల వద్ద జన్మించిన చిన్నారులకు అధికారులు జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య శాఖ రికార్డ్స్ లో నమోదుకాకపోవడంతో అటు అంగన్వాడీ లు కానీ ఇటు పంచాయతీ కార్యదర్సులు కానీ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో చిన్నారులు ఈ తరహా నిరసనకు దిగారు. పిల్లలకే కాకుండా కొంతమంది పెద్దలకు కూడా ఆధార్ కార్డులు ఇవ్వకపోవడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ కీలకం కావడంతో గ్రామస్తులు ఆందోళనలో ఉన్నారు.

నెరేడుబంద సరిహద్దు ప్రాంతం కావడంతో అటు రావికమతం మండల ప‌రిధిలోని గడుతూరు పంచాయతీ కేంద్రానికి, అలాగే చీమలపాడు పంచాయతీ కేంద్రానికి వెళ్లి అడిగినా నేరేడుబంద గ్రామం తమ జాబితాలో లేదని అక్కడి సిబ్బంది చెబుతున్నారని పెద్దలు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ఆ గ్రామ ఆవేద‌న‌ను తీర్చాలని కోరుతున్నారు.

Read Also.. Rain on Greenland: గ్రీన్‌ల్యాండ్‌లోని అత్యంత ఎత్తైన శిఖరంపై భారీ వర్షం.. ఇక్కడ వర్షం కురవడం ఇదే మొదటిసారి!