
‘తనను గెలిపించన ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నా, వాళ్ళముందు దోషిగా నిలబడలేక, క్షణికావేశంలో ఏమైనా చేసుకుంటా, అప్పుడు దానికి బాధ్యత మీరే వహించాలి. తన వార్డు నిర్లక్ష్యానికి గురవుతోందని, కేవలం ప్రతిపక్ష పార్టీ కార్పొరేటర్ కావడం వల్లే అని నేను నమ్ముతున్నాను. వార్డ్ ప్రజల సమస్యలను తాను పరిష్కరించలేకపోతున్నాను ఒక్కోసారి ఏమైనా చేసుకోవాలని అనిపిస్తోంది’ ఇది గ్రేటర్ విశాఖకు చెందిన ఒక కార్పొరేటర్ ఎమోషన్. గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ లోని 79 వ వార్డు టిడిపి కార్పొరేటర్‌గా ఉన్న రౌతు శ్రీనివాసరావు ఆవేదన ఇది. తాను కార్పొరేటర్‌గా ఎంపికై మూడున్నరేళ్లు దాటినా తన వార్డులో ఎలాంటి అభివృద్ది పనులు జరగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు రౌతు శ్రీనివాసరావు. చివరకు కనీసం వీధి లైట్లు వేయకపోవడం వల్ల తన వార్డు చీకట్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను గెలుపొందిన 79 వార్డు పూర్తి గా గ్రామీణ నేపథ్యం ఉన్న ప్రాంతం అని అందులో విద్యుత్ లేకపోతే చీకటి గా ఉంటుందని వాపోయారు కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు. ముఖ్యంగా శివాజీ నగర్, గొల్లవాని పాలెం, ఓల్డ్ ఆగనం పూడి, శాంతి నగర్ సత్రం, శ్రీనివాస నగర్, అన్నపూర్ణ నగర్, కే ఎస్ ఎన్ రెడ్డి నగర్, శనివాడ, లంకెలపాలెం, కరణం వారి వీధి, బీ సీ కాలనీ, దాసరి వీధి, ఎస్ సీ కాలనీ, కొండ వీధి, శ్రీరంగ నాయకుల కాలనీ, అప్పికొండ వారి వీధి, పూజారి వారి వీధి , గొల్ల పేట, లంకెలపాలం ఇండస్ట్రీస్, జాజులవాని పాలెం, అత్తవాని పాలెం, కొండాయ వలస లాంటి ప్రాంతాలలో దాదాపు 500 బల్బులు వెలగడం లేదని, తాను స్వయంగా ప్రతీ స్థంభం వద్దకు వెళ్ళి నోట్ చేసుకుని కమిషనర్ కు ఇచ్చానని, అయినా పట్టించుకోలేదన్నారు రౌతు శ్రీనివాసరావు. అలాగే మరో 190 చోట్ల కొత్త బల్బులు కావాలని కూడా కోరానని అసలు స్పందనే లేదన్నది రౌతు శ్రీనివాసరావు ఆవేదన. దీంతో వార్డు లో తిరుగుతున్నప్పుడు ప్రజలు నన్ను దోషిగా చూస్తున్నారనీ, టీడీపీ కార్పొరేటర్ ను కాబట్టే వివక్ష చూపుతున్నారని ఆరోపించారు రౌతు శ్రీనివాసరావు.
టిడిపి కార్పొరేటర్ కాబట్టి తన పట్ల వివక్ష చూపిస్తూ అభివృద్ధి చేయడం లేదని, తన వార్డులో కనీసం వీధిలైట్లు కూడా వేయకపోవడం వల్ల రాత్రిపూట చీకటి మయంగా మారుతుందన్న ఆవేదన తో కూడిన వీడియోని రౌతు శ్రీనివాసరావు జీవీఎంసీ వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశారు. అయితే ఆవేదన తో కూడిన ఆయన వీడియో చూసిన తోటి కార్పొరేటర్లు పార్టీలకు అతీతంగా స్పందించారు. ఇది కేవలం మీ ఒక్కరి సమస్య కాదంటూ అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు కూడా గళం కలిపారు. తమ వార్డుల్లో కూడా ఇదే తరహా సమస్యలు ఉన్నాయని, వీధిలైట్లు అసలు వెలగడం లేదని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ పలు అధికార పార్టీ కార్పొరేటర్లు ఆయనకు సానుభూతి తెలుపుతూ తమ ఆవేదనను కూడా పోస్ట్ చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని అందరం కలిసి పోరాడుదాం అంటూ అధికార పార్టీ కార్పొరేటర్ల నుంచి మెసేజ్ లు రావడంతో రౌతు శ్రీనివాసరావు కూడా ఆశ్చర్యాన్ని గురయ్యాడట. మొత్తానికి జీవీఎంసీ డొల్లతనం రౌతు శ్రీనివాసరావు వీడియోతో ఒక్కసారిగా బయటపడ్డట్టు అయిందని పలువురు కార్పొరేటర్లు చెప్పుకుంటుండడం విశేషం. కనీసం వీధిలైట్లు కూడా వేయలేని పరిస్థితుల్లో ఇంత పెద్ద గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఉందంటే అధికారులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని, కనీస మౌలిక సదుపాయాలైన వాటి పట్ల శ్రద్ధ వహించాలని కార్పొరేటర్లు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..