
స్మార్ట్ సిటీ విశాఖ అడ్డగా ఇస్మార్ట్ మోసాలకు పాల్పడిన స్నేహ మ్యాక్స్ కేటుగాళ్లకు చెక్ పెట్టారు పోలీసులు. రిటైర్డ్ ఉద్యోగులే టార్గట్‌గా మోసాలకు పాల్పడిన మాజీ IRS శివభాగ్యారావు ను పోలీసులు ఎట్టకేలకు కటకటాల బాటపట్టించారు. విశాఖలో స్నేహ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ పేరిట కస్టమర్లకు కోట్లలో కుచ్చుటోపి పెట్టారు. అధిక వడ్డీ ఎరగా వేసి దాదాపు 15 మంది నుంచి రూ.55 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. ఈ భారీ స్కామ్ సూత్రధారులు, పాత్రదారులైన VRS తీసుకున్న IRS శివ భాగ్యారావు అండ్ సన్స్‌ను అరెస్ట్ చేశారు విశాఖ పోలీసులు.
స్నేహ మ్యాక్స్ చైర్మన్ శివ భాగ్యారావుకు కోర్టు ఈ నెల 18 వరకు రిమాండ్ విధించింది. అతన్ని సెంట్రల్ జైలుకు తరలించారు. శివభాగ్యరావు అతని కుమారులు శ్రీకాంత్, క్రాంతి 12 శాతం వడ్డీ ఇస్తామని ఆశ చూపి కోట్లలో డిపాజిట్లు సేకరించారు. బాధితుల్లో ఎక్కువమంది ఉద్యోగులు, రిటైర్డ్ పోలీసులుకూడా ఉన్నారు. డౌట్ రాకుండా మొదట్లో బాగానే.. అనుకున్న సమయానికి వడ్డీ ఇచ్చారు. ఆ తరువాత ఆపేశారు. అనుమానం వచ్చి ఆరా తీస్తే ఎలాంటి స్పందనలేదు. మోసపోయామని గమనించిన బాధితులు స్నేహ మ్యాక్స్ డిపాజిటర్స్ పరిరక్షణ సంఘంగా ఏర్పడి పోలీసులను ఆశ్రయించారు.
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌కి చెందిన విశ్రాంత IRS అధికారి కటికల శివభాగ్యారావు (65) విశాఖలోని సీతంపేటలో 2008లో ఎస్సీ, ఎస్టీ మ్యూచువల్ కోఆపరేటివ్ సొసైటీ పేరుతో ఉన్న సంస్థను.. భాగస్వామ్యులతో కలిసి 2014లో స్నేహమ్యాక్స్ సొసైటీగా మార్పుచేశారు. అనంతరం అధిక వడ్డీల ఆశ చూపించి.. కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. కోర్టును ఆశ్రయించి ఇంతకాలం బయట ఉన్నారు.. అయితే.. కోర్టు గడువు పూర్తికాగానే మంగళవారం రాత్రి గోపాలపట్నం పోలీసులు.. కూకట్‌పల్లిలో భాగ్యారావును, అతని కుమారుడు క్రాంతిని అరెస్టు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..