పాములంటే భయం లేదు.. కానీ ఆ ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు! నాగుపాము ఎలా కాటేసిందంటే..
విశాఖపట్నానికి చెందిన ప్రముఖ స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్ రొక్కం నాగుపాము కాటుకు గురయ్యారు. స్టీల్ ప్లాంట్ సెక్టార్-2లోని ఓ క్వార్టర్లో పామును రక్షించే క్రమంలో ఈ ఘటన జరిగింది. వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం క్రమంగా కోలుకుంటున్నారు..

పాములు బంధించడంలో ఆయన సిద్ధహస్తుడు.. ఎంతటి తల తిరిగిన పామునైనా క్షణాల్లో ఇట్టే పట్టేస్తాడు. కోరలు చాచే కింగ్ కోబ్రానైనా, భుసలు కొడుతూ పైకి వచ్చే నాగుపామైనా తన తలవంచాల్సిందే. ఎంతటి పామును అయినా ఇట్టే.. బంధించే కిరణ్ కుమార్.. ఎంతోమందిని విష సర్పాల బారి నుంచి కాపాడాడు. ఆ మూగజీవాలకు మనషుల నుంచి ప్రాణహాని లేకుండా చేశాడు. కానీ.. ఇప్పుడు అవే పాముల నుంచి ప్రాణాలపైకి తెచ్చుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. స్నేక్ క్యాచర్ కిరణ్ రొక్కం.. విశాఖ నగరంలో ఈ పేరు తెలియని వారు ఉండరు. ఎందుకంటే ఎక్కడ పాము కనిపించినా సరే.. టక్కున గుర్తుకు వచ్చేది కిరణ్ కుమార్ పేరే. సామాన్యుల నుంచి అధికారుల వరకు.. అందరూ కిరణ్ ని పాములు పట్టేందుకు పిలుస్తుంటారు. జనావాసాల్లోకి వచ్చిన పాములను.. అత్యంత చాకచక్యంగా రెస్క్యూ చేయడంలో కిరణ్ కుమార్ దిట్ట. భుసలు కొట్టే నాగుపామైనా.. మేకలను అమాంతంగా మింగేసే కొండ చిలువలనైనా ఈజీగా బంధించడం కిరణ్ కుమార్ కు పాములతో పెట్టిన విద్య. ఒక విధంగా చెప్పాలంటే నిత్యం పాములతోనే.. అతని రోజువారి జీవితం ముడిపడి ఉంటుంది. వేల సంఖ్యల్లో పాములను పట్టి.. వాటి నుంచి మనుషుల ప్రాణాలు కాపాడడం, మనసులో నుంచి సర్పాలకు హాని కలగకుండా కిరణ్ కుమార్ అవగాహన పెంచుతూ ఉంటాడు.
కిరణ్ కుమార్ రోక్కం.. ‘స్నేక్ సేవర్ సొసైటీ’ ద్వారా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో పాములను సురక్షితంగా పట్టుకుని, అడవుల్లో లేదా సురక్షిత ప్రదేశాల్లో వదులుతుంటారు. ఎక్కడ పాము కనిపించినా సరే.. హాని తలపెట్టకుండా తమకు సమాచారం ఇవ్వాలని పదేపదే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉంటాడు. కనిపించిన వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉంటాడు. ఒకచోట ఒక పాము ఉందని సమాచారం అందగానే.. నిమిషాల్లో వాలిపోయి దాన్ని రెస్క్యూ చేయడం అతని హాబీ. ఇలా వేరువేరు చోట పట్టిన పాములను.. కట్టలు కట్టలుగా తీసుకెళ్లి అడవుల్లో సేఫ్ గా విడిచిపెడుతుంటారు.
ఇతనికి ప్రతిరోజూ ఏదో మూలనుంచి పాములు వచ్చాయంటూ సమాచారం వస్తూనే ఉంటుంది. రాత్రి అయినా.. పగలైనా.. సమాచారం వచ్చిన వెంటనే అక్కడ వాలిపోయి.. వాటిని రెస్క్యూ చేస్తూ ఉంటాడు. ఏసీలో పాములు, ఫ్రిజ్‌లో సర్పాలు, కాలువలో కొండ చిలువలు, నటింట్లో నాగుపాములు, వాష్ రూమ్ లో వచ్చిన సర్పాలు.. ఇలా ఇలా జనావాశాల్లోకి వచ్చేస్తున్న కొండచిలువలు, నాగుపాములు, కింగ్ కోబ్రాలు తరచూ రెస్క్యూ చేస్తూ ఉంటాడు. దశాబ్దాలుగా వేలాది పాములను ప్రాణాపాయం నుండి కాపాడి వన్యప్రాణి సంరక్షణకు కృషి చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ద్వారా అధికారిక గుర్తింపు పొందిన స్నేక్ క్యాచర్‌గా సేవలందిస్తున్నారు. ఇలా.. కిరణ్ కుమార్ చేసిన సేవలకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా స్వయంగా అవార్డు కూడా అందుకున్నాడు.
వీడియో చూడండి..
నాగు పామును పట్టబోయి.. ప్రాణాల పైకి తెచ్చుకొని..
పాములు పట్టడంలో నేర్పరి కలిగిన కిరణ్ కుమార్.. అనుకోని ప్రమాదంలో పడ్డాడు. ఎప్పుడు మాదిరిగానే స్టీల్ ప్లాంట్ సెక్టార్ 2 నుంచి ఒక కాల్ అందుకున్నాడు కిరణ్ కుమార్. చీకటి పడినా సరే.. నిమిషాల్లో అక్కడికి వాలిపోయాడు. స్టీల్ ప్లాంట్ క్వార్టర్ లో నివసిస్తున్న ఆ కుటుంబం విజ్ఞప్తి మేరకు.. పామును రెస్క్యూ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇంటి గోడ, స్థంభం మధ్య నక్కి ఉన్న ఆ పామును.. చూశాడు కిరణ్ కుమార్. నాగుపాముగా గుర్తించి.. రెస్క్యూ చేయబోయాడు. వెలుతురు సరిగా లేకున్నా.. క్వార్టర్ లో నివసిస్తున్న కుటుంబం కోసం సాహసం చేసాడు. టార్చ్ లైట్ వెలుతురులో.. పామును పట్టేందుకు సిద్ధమయ్యాడు. పెద్ద పెద్ద పాములను, కోపంతో రగిలిపోయే సర్పలను.. ఈజీగా రెస్క్యూ చేసే కిరణ్ కుమార్.. పాములను పట్టే సమయంలో అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తాడు. ఈ పాము విషయంలోనూ అలాగే చేసాడు. చీకటిగా ఉండడంతో.. తోక భాగం వైపు చేయి పెట్టాడు.. అయితే ఆ తోక దగ్గరే ఆ పాము తల కూడా ఉందన్న విషయం గుర్తించలేకపోయాడు. దీంతో చేయి పెట్టగానే.. అప్పటికే నోరు విప్పి సిద్ధంగా ఉన్న నాగుపాము.. కిరణ్ కుమార్ బొటనవేలిని పట్టుకుంది. వెంటనే అప్రమత్తమైన కిరణ్ కుమార్ తన చేతిని పైకి తీసేసాడు. ఆ తర్వాత పామును పామును రెస్క్యూ చేశాడు. అప్పటికే తన ఎడమ చేతి బొటన వేలు పై గాట్లు కనిపించాయి. మెల్లగా.. కళ్ళు మసకబారడం మొదలయ్యాయి. వెంటనే మరొక సాయంతో బైక్ పై సమీపంలోని స్టీల్ ప్లాంట్ ఆసుపత్రికి వెళ్ళాడు కిరణ్. హుటాహుటిన అక్కడి వైద్యులు.. కిరణ్ కుమార్ కు వైద్యం ప్రారంభించారు. అప్పటికే నాగుపాము విషం కిరణ్ కుమార్ శరీరంపై ప్రభావం చూపడం ప్రారంభించింది. సకాలంలో వైద్యం అందడంతో.. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. అయినప్పటికీ నాగుపాము విషం శరీరంలోకి పాకుతుంది.. వెంటనే వైద్యులు మెరుగైన చికిత్స కోసం కేజిహెచ్ కు పంపించారు. అక్కడ వైద్యులు మరింత మెరుగైన వైద్యం అందించారు. ఇప్పుడు క్రమంగా కోరుకుంటున్నాడు కిరణ్ కుమార్.
కాస్త ఆలస్యమైనా ప్రాణం డేంజర్లో పడేది..
‘నాగుపాము ను రెస్క్యూ చేయబోతే నా బొటన వేలును పట్టుకుంది. వేలును పట్టి లాగింది.. వెంటనే నోట్లో ఉన్న నా ఎడమచేతి బొటనవేలును లాగేసాను. అప్పటికే తన రెండు కోరలతో 8 చోట్ల గాట్లు పడ్డాయి. విషం శరీరంలోకి పాకుతోంది. ఆరోగ్యం క్రమంగా క్షిణిస్తోంది. సకాలంలో ఆసుపత్రికి వెళ్లకుంటే.. నా ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉండేది. రెండు మూడు రోజులు గడిచిన.. ఇప్పటికీ నాకు మగత గానే ఉంది. ఎడమ చేయి లాగేస్తోంది. ఆ పాము చాలా కోపంతో ఉంది. కచ్చితంగా నాకు ఒక పునర్జన్మే.’ అని టీవీ9 కు వివరించ్చాడు స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్. పాములు పట్టే విషయంలో.. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. ముప్పు తప్పదన్న విషయం ప్రతి ఒక్కరూ గమనించాలి.
