
విశాఖపట్నంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు వింత అనుభూతి ఎదురైంది. తొలిరోజు డిపోలో ప్రార్థన చేసి వెళ్లిన ఆ డ్రైవర్.. మరుసటి రోజు వచ్చి చూసేసరికి ఆ బస్సు మాయమైంది. కంగుతున్న డ్రైవర్.. ఓనర్ కు సమాచారం అందించడంతో పోలీసులను ఆశ్రయించారు. సిసి కెమెరా వెరిఫై చేస్తే.. షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఎట్టకేలకు ఆ బస్సును ముప్పై కిలోమీటర్ల దూరంలో గుర్తించి రికవరీ చేసారు పోలీసులు. ఈ ఘటన ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ బస్సు అక్కడ నుంచి ఎలా మాయమైంది.
విశాఖలో నాయుడు అనే వ్యక్తికి ఆరు బస్సులున్నాయి. అవి ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన నడుస్తున్నాయి. ఈ నెల 16న శ్రీకాకుళం నుంచి AP 39UX 2888 నెంబర్ గల బస్సు మద్దిలపాలెం బస్టాండుకు చేరింది. బస్సు డ్రైవర్ అప్పారావు 197 లీటర్ల డీజిల్ ఫుల్ చేయించి.. రాత్రి 9.45 గంటల సమయంలో మద్దిలపాలెం డిపో పార్శిల్ కౌంటర్ వద్ద పార్క్ చేశాడు. డ్యూటీ దిగి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అయితే.. మరుసటి రోజు ఉదయం డ్రైవర్ అప్పారావు వచ్చి చూసేసరికి బస్సు కనిపించలేదు. తాను పార్కు చేసిన ప్రాంతంలో బస్సు లేకపోయేసరికి డిపో అంతా వెతికాడు. ఒకానొక సమయంలో తాను అక్కడే పార్క్ చేశానా అన్న సందేహంలో కూడా వెళ్లిపోయాడు ఆ డ్రైవర్. కాసేపు పరిసర ప్రాంతాల్లో వెతికిన తర్వాత అప్పారావు.. తన యజమానికి సమాచారం అందించాడు. దీంతో యజమాని నాయుడు కూడా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. విషయాన్ని పోలీసులకు సమాచారం అందించామని అన్నాడు డ్రైవర్ అప్పారావు.
కేసు నమోదు చేసిన ఎంవీపీ పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అర్ధరాత్రి ఆ బస్సు కదులుతూ.. రోడ్లపై వెళ్తున్నట్టు గుర్తించారు. మద్దిలపాలెం డిపో నుంచి హైవే మీదుగా వెళుతూ కనిపించింది. బస్సు లంకిలపాలెం జంక్షన్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. అయితే.. బస్సు ఎత్తుకెళ్లింది అదే యజమాని వద్ద డ్రైవర్‌గా పనిచేసే ఈగల పైడిరాజుపై అనుమానం రావడంతో గాలింపు ముమ్మరం చేశారు. ఈ నెల 19న రామా టాకీస్ సమీపంలో బస్సుతో సహా పైడిరాజును పోలీసులు పట్టుకున్నారు.
పైడిరాజును విచారించేసరికి పోలీసులకు మరో షాకింగ్ విషయం తెలిసింది. మద్యానికి బానిసైన పైడిరాజు.. బస్సులోని ఫుల్ ట్యాంక్ ఉన్న డీజిల్ అమ్మందుకు ప్లాన్ చేశాడు. ఆ డబ్బుతో మద్యం తాగాలని అనుకుని పక్కా స్కెచ్ వేసి.. బస్సును ఎత్తుకెళ్లినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ఈ విషయం తెలుసుకొని స్వయానా పోలీస్ బాస్ కూడా షాక్ అయ్యారు. ఇటువంటి ఘటన తాను చూడలేదన్నారు సీపీ బాగ్చి.
పైడిరాజును విచారిస్తే మరో షాకింగ్ విషయం కూడా బయటపడింది. పైడిరాజు ఇలా చేయడం ఇది మొదటిసారి కాదు. గతేడాది ద్వారకానగర్ బస్టాండ్‌లో బస్సును కూడా ఎత్తుకెళ్లాడు. డీజిల్ అమ్ముకుని 4 వేలు సంపాదించాడు. ఆ తర్వాత బస్సును హైవేపై వదిలేసి పరారయ్యాడు. ఈ ఘటనపై అప్పట్లోనే టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బస్సు అయితే అప్పట్లో కనిపించింది గాని నిందితుడు ఎవరో ఇప్పటివరకు తెలియలేదు. ఈ కేసులో పైడ్రాజును పట్టుకుని విచారిస్తే.. గతేడాది బస్సు తెఫ్టు కేసు కూడా ఓ కొలిక్కి వచ్చినట్టయింది. మద్యానికి వ్యసనమైన వ్యక్తి ఏ స్థాయికైనా వెళ్తాడు అనేందుకు ఈ ఘటన కూడా ఒక ఉదాహరణ.. అని పోలీసులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..