
విశాఖపట్నం, ఆగస్టు 9: విశాఖ నగర పాలక సంస్థలో అది ఒక చెత్త తరలించే వాహనం. ప్రతిరోజూ ఆ వాహనం మైక్ నుంచి తమ ఇళ్లలోని తడి, పొడి చెత్తను తెచ్చి ఆ వాహనంలో వేయాలంటూ అనౌన్స్‌మెంట్ వస్తూ ఉంటుంది. కానీ, ఈరోజు అదే వాహనం నుంచి రోజు కంటే పెద్ద శబ్దంతో వస్తోన్న అనౌన్స్‌మెంట్ అందరినీ షాక్ కు గురిచేసింది. అయితే, రెగ్యులర్ గా వచ్చే చెత్త తరలింపుకు సంబంధించింది కాదు ఆ అనౌన్స్‌మెంట్.. ఒక రాజకీయ పార్టీ సమావేశానికి హాజరు కావాలంటూ ఆ చెత్త వాహన డ్రైవర్ పెద్ద ఎత్తున పిలుపునిస్తూ ఉన్నారు. అందులోనూ అది అధికార పార్టీకి సంబంధించిన సమావేశం కూడా కాదు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రేపటి నుంచి విశాఖలో నిర్వహించబోతున్న వారాహి యాత్రలో భాగంగా గురువారం సాయంత్రం జగదాంబ జంక్షన్లో జరిగే బహిరంగ సభకు హాజరు కావాలంటూ ఆ వాహనం నుంచి అనౌన్స్‌మెంట్ రావడం ఆ ప్రాంతవాసులని గందరగోళంలో పడేసింది. అదేమో చెత్త తరలింపు వాహనం, ప్రచారమేమో జనసేన వారాహి యాత్ర బహిరంగ సభ గురించి.. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ పాలక వర్గం అధీనంలో ఉన్న జీవీఎంసీకి చెందిన ఈ చెత్త తరలింపు వెహికల్ అధికార పార్టీని టార్గెట్ చేస్తూ వస్తున్న పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు చెందిన బహిరంగ సభకు హాజరు కావాలంటూ ప్రచారం చేయడం విశాఖపట్నంతో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
జీవీఎంసీ అధికారిక చెత్త తరలింపు వాహనం నుంచి జనసేన బహిరంగ సభకు హాజరు కావాలంటూ అనౌన్స్‌మెంట్ వస్తుండడంతో కాసేపు షాక్ కు గురైన వైసీపీకి సంబంధించిన స్థానిక నేతలు వెంటనే షాకయ్యారు. అసలెందుకు ఇలా జరిగింది అని ఆరా తీస్తే.. ఆ డ్రైవర్ పవన్ కళ్యాణ్ అభిమానిగా గుర్తించారు. 37వ వార్డుకు చెందిన కామేష్ జీవీఎంసీలో కాంట్రాక్ట్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఆ చెత్త తరలింపు వాహనానికి డ్రైవింగ్ చేస్తున్న ఆయన ఈ పని చేసినట్లు గుర్తించారు. వెంటనే అలాంటి అనౌన్స్మెంట్ వచ్చే సమయంలో వీడియో రికార్డ్ చేసి అధికారులకు పంపారు వైసీపీ నేతలు. దీంతో ఆగ్రహించిన అధికారులు సమాచారాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ కి తెలియజేశారు. దీన్ని కమిషనర్ ఎలా తీసుకుంటారో చూడాల్సి ఉంది.
విశాఖలో వారాహి విజయ యాత్ర ఫీవర్ ప్రారంభమైంది. ఆయన రాక కోసం ఎదురుచూస్తున్న పవన్ అభిమానులు ఇప్పటికే తమకు చేతనైన రీతిలో ప్రచారాన్ని ప్రారంభించారు. అలాంటి పవన్ వీరాభిమానే ఈ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ చెత్త తరలింపు వాహన డ్రైవర్ కూడా.. ఆయన ఏకంగా ఇళ్ళ నుంచి చెత్త సేకరించడానికి ఉపయోగించే మైకు సహాయంతో 37వ వార్డులో అన్ని వీధుల్లోకి వెళ్లి పదవ తేదీ నుంచి వారాహి యాత్ర ప్రారంభమవుతుందని.. సాయంత్రం జగదాంబ జంక్షన్ లో పవన్ బహిరంగ సభ నిర్వహించబోతున్నారని, అందరూ హాజరు కావాలంటూ చేసిన ప్రచారం చర్చనీయాంశంగా మారింది. ఇలా చేస్తే తన ఉద్యోగం కూడా పోతుందని తెలిసి కూడా కామేష్ ఇలా చేయడం.. హాట్ టాపిక్ అయింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..