శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం సుసరాం గ్రామంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. కొబ్బరి బొండాల కోసం చకచకా గ్రామంలోని ఓ కొబ్బరి చెట్టును ఎక్కేసింది. పొలాల్లోని రైతులు చూస్తుండగానే అడ్డొచ్చిన కొబ్బరి కొమ్మల్ని, కొబ్బరి బొండాలని తెంపి పడేసింది. ఎంచక్కా కొబ్బరి బొండాం వలిచి అందులోని నీళ్ళును, గుజ్జును లాగించేసింది. మళ్ళీ కాసేపటికే చెట్టుపై నుండి చకచకా దిగేసి హుందాగా అక్కడ నుంచి జారుకుంది ఎలుగు బంటి. ఈ వింత ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎలుగు బంటి కొబ్బరి చెట్టు ఎక్కి దిగటాన్ని గమనించిన స్థానికులు తమ మొబైల్ ఫోన్ లో వీడియో తీశారు.
ఎలుగు బంట్లు కొబ్బరి ముక్కలు తినడానికి బాగా ఇష్ట పడతాయి. జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి చిప్పలు కోసం రాత్రి పూట ఎలుగు బంట్లు గ్రామాల్లోని దేవాలయాలలోకి ప్రవేశించి హల్ చల్ చేసిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. అయితే ఇప్పుడు అదే కొబ్బరి కోసం ఏకంగా కొబ్బరి చెట్టే ఎక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా కోతులు, చింపాంజీలు, పక్షులు ఎక్కువగా చెట్ల మీదే గడుపుతూ ఉంటాయి. ఒక కొమ్ము పై నుంచి ఇంకొ కొమ్మకి ఎగురుతూ చూసేవారికి వినోదాన్ని కలిగిస్తాయి. ఎలుగుబంట్లు, పులులు, సింహాలు వంటి భారీ జంతువులు కూడా చెట్లు ఎక్కగలవని చాలా మందికి తెలిసిన విషయమే. కానీ అది ప్రత్యక్షంగా చూసే సందర్భం మాత్రం తక్కువనే చెప్పాలి. అయితే మంగళవారం సుసరాంలో భారీ సైజులో ఉన్న ఎలుగుబంటి అంత ఎత్తులో ఉన్న కొబ్బరి చెట్టును అవలీలగా ఎక్కి దిగింది. ఆ దృశ్యాన్ని కళ్ళారా చూసిన వారంతా అవాక్కయ్యారు. ఎలుగుబంట్లు ఇంత ఈజీగా చెట్లు ఎక్కగలవా అంటూ అంతా చర్చించుకున్నారు.
అయితే అంత పెద్ద ఎలుగుబంటిని చూసిన వారంతా వ్యవసాయ పనుల నిమిత్తం ఒంటరిగా పొలాల్లోకి వెళ్లాలంటేనే భయపడి పోతున్నారు. ఎలుగుబంటి ఎక్కడ మాటు వేస్తుందో ఎదురు పడితే ఎవరిపై దాడి చేస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు ఎలుగుబంటి నుండి తమకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అభయారణ్యంలో తిరగాల్సిన అడవి జంతువులు జనారణ్యం బాట పడుతుండటం ఇటీవల సర్వసాధారనమై పోయింది. అడవులు అంతరించిపోతుండటం.. మాఫియా దెబ్బకు కొండలు, గుట్టలు మాయమైపోతుండటంతో వాటికి సరైన ప్రాంతాల్లో నివసించే ఆవశం కొరవడుతుంది. దీనికి తోడు ఆహారము నీరు కూడా దొరకక గ్రామాలపై పడుతున్నాయి అడవి జంతువులు. శ్రీకాకుళం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో జనావాసాలలోకి వస్తోన్న అడవి జంతువుల బెడద ఎక్కువగానే ఉంది. కొత్తూరు, భామిని, సీతంపేట మండలాల పరిధిలో ఏనుగుల బెడద ఎక్కువుగా ఉంటే.. ఉద్దానం, టెక్కలి, పోలాకి, సంతబొమ్మాళి, కోట బొమ్మాళి మండలాల పరిధిలో ఎలుగుబంట్లు బెడద ఎక్కువుగా ఉంది. ఇది కాకుండా ఆంధ్రా ,ఒరిస్సా సరిహద్దు మండలాలలో కోతులు జనాలను బెంబేలెత్తిస్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..