గోదావరికి (Godavari) మరో సారి ప్రవాహ ఉద్ధృతి పెరుగుతోంది. జూలై, ఆగస్టు నెలల్లో వచ్చిన వరదలను మరవకముందే మరోసారి వరదలు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలు, ఉపనదులకు వస్తున్న వరదతో గోదావరిలో క్రమంగా ప్రవాహం పెరుగుతోంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటి మట్టం 13.75 అడుగులకు చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అధికారులు తక్షణమే సహాయక చర్యలకు సిద్ధం కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ(Konaseema), తూర్పు గోదావరి జిల్లాల కలెక్టర్లు అలర్ట్ అయ్యారు. వర్షాలు, వరదలతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లేడులంకలో ఓ రైతు ప్రవాహంలో గల్లంతయ్యాడు. తెప్పపై పొలానికి వెళ్తుండగా ప్రవాహం పెరిగి కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు ఆయన ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
పలు చోట్ల రోడ్లపై నుంచి నీరు ప్రవహిస్తోంది. మోకాలి లోతు నీటిలో ప్రజలు పడవలపై ప్రయాణాలు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని పరీవాహక ప్రాంతాల్లో లోతట్టు లంక భూములు నీట మునిగాయి. కాగా.. గోదావరికి వరదల సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు సముద్రంలో 4,844 టీఎంసీలు విడుదల చేసినట్లు జలవనరులశాఖ అధికారులు వెల్లడించారు.
మరోవైపు.. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. 51.60 అడుగుల వద్ద నమోదైంది. జాతీయ రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. పంటలు నీట మునిగాయి. భద్రాచలం-పేరూరు మధ్య తూరుబాక, పర్ణశాల, ఆలుబాక, గంగోలు రోడ్లపై నీరు చేరింది. బూర్గంపాడు మండలం సారపాక, అశ్వాపురం మండలం రామచంద్రాపురం, నెల్లిపాక బంజర వద్ద కూడా రోడ్లు మునిగాయి. రోడ్లపై నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..