విజయవాడ నగరంలో కోవిడ్ పాజిటివ్ రేటును తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. కోవిడ్ బాధితులను గుర్తించేందుకు ఇంటింటికి ఫీవర్ సర్వే చేస్తున్నామని వెల్లడించారు. 64 వార్డులకు 64 మంది వైద్యాధికారులు నియామకం జరిగిందన్నారు. ఆశా కార్యకర్తలుANMలు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. వారంలో మూడు రోజులు నగరవ్యాప్తంగా కోవిడ్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఫీవర్ సర్వేలో స్పెషల్ ఆఫీసర్లదే పూర్తి బాధ్యతని పేర్కొన్నారు. నగరంలో కోవిడ్ పాజిటివ్ కేసుల నియంత్రణకు ఈ సర్వే చేస్తున్నట్లుగా వెల్లడించారు. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేసుకుని ఫీవర్ సర్వే నిర్వహించి పాజిటివ్ రేట్ ను తగ్గించాలని సూచించారు. అయితే.. ఈ ఉదయం నుంచే ఇంటింటి సర్వేను మొదలు పెట్టారు వైద్య అధికారులు. ఇంటింటి తిరుగుతూ ఇంట్లోని అందరికి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 93,759 శాంపిల్స్‌ను పరీక్షించగా 3,464 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. కొవిడ్-19తో 35 మంది చనిపోయారు. కాగా 4,284 మంది కొవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారు. తాజా పాజిటివ్ కేసులతో కలుపుకుని ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,93,923కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 37,323గా ఉంది.