AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayanagaram: పేదోళ్లకు నాణ్యమైన విద్య దక్కాలంటే మీలాంటి వాళ్లు కావాలి సార్ – విజయనగరం జిల్లా కలెక్టర్‌పై ప్రశంసలు

విద్యా హక్కు చట్టం (RTE) అమలులో తప్పులపై విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం 25% సీట్లు కేటాయించాల్సిన నిబంధనలు ఉల్లంఘించిన ఆరు కార్పొరేట్ పాఠశాలలను సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలలో సౌకర్యాల లేమి, అవకతవకలు గుర్తించడంతో విద్యా రంగంలో కలకలం రేగింది. అధికారుల దర్యాప్తు ఒత్తిడితో పాఠశాలలు వెనుకడుగు వేసి, నిబంధనలు పాటిస్తామని హామీ ఇచ్చాయి.

Vijayanagaram: పేదోళ్లకు నాణ్యమైన విద్య దక్కాలంటే మీలాంటి వాళ్లు కావాలి సార్ - విజయనగరం జిల్లా కలెక్టర్‌పై ప్రశంసలు
Vizianagaram Collector Dr.B.R.Ambedkar
Gamidi Koteswara Rao
| Edited By: Ram Naramaneni|

Updated on: Jun 30, 2025 | 9:49 PM

Share

విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కార్పొరేట్ విద్యాసంస్థలకు గట్టి షాక్ ఇచ్చారు. విద్యా హక్కు చట్టం (RTE) 2009 ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం 25% సీట్లు కేటాయించాల్సిన నిబంధనలను ఉల్లంఘించిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్, భాష్యం, సన్ స్కూల్, బీసెంట్ స్కూల్స్‌తో సహా ఆరు పాఠశాలల పై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంస్థలను సీజ్ చేయాలని ఆదేశించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కార్పొరేట్ పాఠశాలలను సీజ్ చేయమని ఆదేశించడం విద్యా రంగంలో కలకలం రేగింది. అధికారులు ఈ పాఠశాలలలో తనిఖీలు నిర్వహించారు. అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఆర్టిఈ అమలు, స్కూల్లో మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బంది అర్హతలు, శానిటేషన్, భద్రతా ప్రమాణాలపై లోతైన దర్యాప్తు చేశారు. తనిఖీలలో సీట్ల కేటాయింపులో అవకతవకలు, సౌకర్యాల లేమి, అనర్హతా సిబ్బంది వంటి లోపాలను గుర్తించారు. అధికారులు చేపట్టిన చర్యలతో ఒత్తిడికి గురైన కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు వెనక్కి తగ్గాయి. తక్షణమే ఆర్టిఈ చట్టాన్ని అమలు చేస్తామని, నిబంధనలకు అనుగుణంగా సీట్ల కేటాయింపు, మౌలిక సదుపాయాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాయి.

కార్పోరేట్ స్కూల్స్ ఇచ్చిన హామీలను కఠినంగా పర్యవేక్షించాలని విద్యాశాఖ అధికారులకు అధికారులను ఆదేశించారు కలెక్టర్ అంబేద్కర్. కలెక్టర్ చేపట్టిన చర్యలు విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సామాజిక న్యాయాన్ని అందించడంలో కీలకంగా మారాయని జిల్లావాసులు అభిప్రాయపడుతున్నారు. కలెక్టర్ అంబేద్కర్ చేపట్టిన చర్యలపై విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహాలో ఇతర జిల్లాలలో కూడా పాటించాలని కోరుతున్నారు. అయితే తెల్ల రేషన్ కార్డుతో కార్పొరేట్ స్కూల్స్‌లో ఉచిత విద్య పొందుతున్న విద్యార్థులపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రుల కమిటీలు, పేదవారికి మెరుగైన విద్య అందించడానికి ప్రభుత్వం చేపట్టిన ఆర్టీఈ చట్టం నిజమైన లబ్ధిదారులకు కాకుండా లబ్ధిదారులు ముసుగులో ఉన్న ధనవంతులు కూడా ప్రయోజనం పొందుతున్నారని, నిజమైన పేదవారికి అన్యాయం జరుగుతుందని అంటున్నారు. అధికారులను మేనేజ్ చేసి తెల్లరేషన్ కార్డులు పొంది, వాటి సహాయంతో నిజమైన పేదవారి ప్రయోజనాలు కాలరాస్తున్నారని చెప్తున్నారు. విద్యా చట్టం ప్రకారం కార్పొరేట్ స్కూల్స్ లో సీట్లు పొందిన విద్యార్థుల స్థితిగతులు, ఆర్థిక పరిస్థితి ఏంటి అంశాల పై లోతుగా విచారించి, తెల్ల రేషన్ కార్డులు పొందిన అనర్హులను గుర్తించి నిజమైన పేదవారికి మాత్రమే న్యాయం చేయాలని కోరుతున్నారు తల్లిదండ్రులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.