AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bobbili: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియురాలి తండ్రిని హతమార్చిన ప్రియుడు

విజయనగరం జిల్లా బొబ్బిలిలో కనిమెరకల వెంకటరమణ హత్య కేసును పోలీసులు చేధించారు. ఘటనా స్థలంలో నిందితుడి పర్సు, ఫోన్ ఆధారంగా దర్యాప్తు సాగించి, కోట సర్వేశ్వరరావును అరెస్టు చేశారు. పాతబొబ్బిలికి చెందిన సర్వేశ్వరరావు, వెంకటరమణ కుమార్తెతో సంబంధాల కారణంగా, కోపంతో వెంకటరమణను హత్య చేసినట్లు వెల్లడైంది. నేరాన్ని అంగీకరించిన సర్వేశ్వరరావును రిమాండ్‌కు తరలించారు.

Bobbili: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియురాలి తండ్రిని హతమార్చిన ప్రియుడు
Murder Case Solved
Gamidi Koteswara Rao
| Edited By: Ram Naramaneni|

Updated on: Jun 30, 2025 | 9:10 PM

Share

విజయనగరం జిల్లా బొబ్బిలిలో సంచలనం సృష్టించిన కనిమెరకల వెంకటరమణ(55) హత్యకేసును చేధించారు పోలీసులు. బొబ్బిలి పట్టణంలోని దిబ్బవీధికి చెందిన వెంకటరమణ గ్రోత్ సెంటర్‌లోని రాఘవ కనస్ట్రక్షన్స్ ఎలక్ట్రికల్ స్టోర్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. వెంకటరమణ ఈ నెల 20వ తేదీ అర్ధరాత్రి విధుల్లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తి ఆయన పై తీవ్రంగా దాడి చేసి గాయపరిచాడు. వెంకటరమణ చనిపోయాడని అనుకున్న నిందితుడు అక్కడ నుండి వెళ్లిపోయాడు. అయితే తీవ్ర గాయాలతో రక్తస్రావం అవుతున్న వెంకటరమణ అతికష్టం మీద దాడి జరిగిన ప్రాంతం నుండి పెట్రోల్ బంక్ వరకు చేరుకుని అక్కడ కుప్పకూలిపోయాడు. అలా అక్కడ వెంకటరమణ పరిస్థితి గమనించిన స్థానికులు ఆయన కుమారుడు పురుషోత్తంకు సమాచారం అందించారు. వెంటనే తండ్రి వద్దకు వచ్చిన పురుషోత్తం తన తండ్రిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. అయితే వెంకటరమణ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు వెంకటరమణను విజయనగరం కేంద్రాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆయన మృతి చెందాడు. ఈ ఘటనపై బొబ్బిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్య కేసు చేధించేందుకు సీఐ సతీష్‌ ఆధ్వర్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. రెండు బృందాలుగా ఏర్పడి ఘటనా స్థలంలో సాక్ష్యాలను సేకరించారు.

ఘటనా స్థలంలో నిందితుడి పర్సు, ఫొటో, సెల్‌ఫోన్ నంబర్ లభ్యమవ్వడంతో దర్యాప్తు వేగవంతమైంది. టెక్నాలజీ సాయంతో నిందితుడి ఫోన్ సిగ్నల్స్‌ను ట్రాక్ చేసి అదుపులోకి తీసుకున్నారు. వెంకటరమణను హత్య చేసిన వ్యక్తి పాతబొబ్బిలికి చెందిన కోట సర్వేశ్వరరావుగా గుర్తించారు. శుక్రవారం అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే వెంకటరమణ హత్యకేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు సర్వేశ్వరరావు స్థానిక చికెన్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. మృతుడు వెంకటరమణ కుమార్తె అదే చికెన్ సెంటర్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధంకు దారి తీసింది. అయితే ఈ పరిచయం వెంకటరమణకు నచ్చలేదు. ఇదే విషయంలో వెంకటరమణ కుటుంబంలో అనేక సార్లు గొడవపడ్డారు. తన కుమార్తెను ఇబ్బంది పెట్టవద్దని వెంకటరమణ సర్వేశ్వరరావును పలుమార్లు మందలించాడు. దీంతో కోపంతో రగిలిపోయిన సర్వేశ్వరరావు, వెంకటరమణను హతమార్చాలని నిర్ణయించాడు. అందులో భాగంగా ఈ నెల 20వ తేదీ రాత్రి సర్వేశ్వరరావు వెంకటరమణ పనిచేసే గ్రోత్ సెంటర్‌కు వెళ్లాడు. చాలాసేపు అక్కడే కాపు కాసి, సరైన సమయం కోసం ఎదురుచూశాడు. తనకు అనుకూలంగా ఉన్న సమయం చూసుకొని వెంకటరమణపై దాడి చేసి, తీవ్రంగా కొట్టి గాయపరిచాడు. వెంకటరమణ మృతి చెందాడని భావించి, అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే తండ్రి హత్యకు సర్వేశ్వరరావు ప్లాన్ చేసినట్లు కుమార్తె కి కూడా తెలియదని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఎట్టకేలకు పోలీసుల విచారణలో సర్వేశ్వరరావు నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.