షాప్‌నకు లైసెన్స్ ఫీజు కట్టకపోతే.. సాధారణంగా ఫైన్ వేయడమో.. లేక వచ్చి హడావుడి చేయడమో చేస్తుంటారు పంచాయితీ సిబ్బంది. కానీ ముక్కు పిండి లైసెన్స్ ఫీజు వసూలు చేయడంలో ఉరవకొండ మేజర్ పంచాయితీ సిబ్బంది రూటే సెపరేట్. స్థానికంగా ఉండే ఓ షాపు యజమాని పంచాయతీకి ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించకపోవడంతో.. పంచాయితీ సిబ్బంది ఏకంగా సదరు వ్యక్తి దుకాణం ముందు చెత్త పారబోశారు. ఎన్ని రోజులు అడిగినా ఫీజు చెల్లించకపోగా.. పంచాయతీ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తిస్తున్నాడని.. గ్రామమంతటా సేకరించిన చెత్తను తీసుకొచ్చి అతడి షాపు ముందు పారబోశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో పంచాయతీ సిబ్బంది చేసిన ఈ పని చర్చనీయాంశంగా మారింది.
లైసెన్స్ ఫీజు చెల్లించలేదని షాపు ముందు చెత్తను పారబోసి.. మరీ పంచాయతీ సిబ్బంది ఫీజు వసూలు చేశారు. లైసెన్స్ ఫీజు చెల్లించలేదన్న కారణంతో వేరే ప్రాంతంలో సేకరించిన చెత్తను కిరాణా దుకాణం ముందు పడేసి వినూత్న రీతిలో పన్ను వసూలు చేశారు. ఉరవకొండ పట్టణంలోని ఇందిరా నగర్ నాలుగో వీధిలో యశ్వంత్ అనే వ్యక్తి నూతనంగా కిరాణా దుకాణం ఏర్పాటు చేశాడు. అందుకోసం మేజర్ పంచాయతీ నుంచి ఎటువంటి లైసెన్సు తీసుకోలేదు. పలుమార్లు లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ పంచాయితీ సిబ్బంది యశ్వంత్‌ను కోరగా.. ఫీజు చెల్లించకపోగా, నోటికొచ్చినట్లు మాట్లాడాడు అని పంచాయతీ సిబ్బంది చెబుతున్నారు. యశ్వంత్ తీరును ఉద్యోగులు.. పంచాయితీ కార్యదర్శి వద్దకు తీసుకెళ్లారు. పన్ను కట్టమని అడిగితే.. దురుసుగా మాట్లాడడంతో పంచాయితీ కార్యదర్శి ఆదేశాల మేరకు పట్టణంలో సేకరించిన చెత్తను ట్రాక్టర్‌లో తీసుకువచ్చి యశ్వంత్ కిరాణా దుకాణం ముందు పారబోసి తమ నిరసన తెలియజేశారు. దీంతో బెట్టుదిగిన దుకాణం యజమాని పంచాయితీ కార్యాలయానికి వచ్చి లైసెన్స్ ఫీజును చెల్లించాడు. మొత్తం మీద 1200 రూపాయల లైసెన్స్ ఫీజు వసూలు చేయడం కోసం పట్టణంలో సేకరించిన చెత్తను ఇలా దుకాణం ముందు పారబోయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.