వర్షాల కోసం ఊరంతా ఒక్కటై వనభోజనాలు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా?
వర్షాలు సమృద్ధిగా కురవాలని అనంతపురం జిల్లాలోని ఓ గ్రామంలో గ్రామస్తులంతా కలిసి వనభోజనాలకు వెళ్లే వింత ఆచారం కొనసాగుతోంది. కళ్యాణదుర్గం నియోజకవర్గం బోరంపల్లిలో పూర్వీకుల కాలం నుంచి ఈ సంప్రదాయం పాటిస్తున్నారు. ఇళ్లకు తాళాలు వేసుకుని మేళతాళాలతో ఊరేగింపుగా ఊరి శివారుకు వెళ్లి..

అనంతపురం, ఆగస్ట్ 29: వర్షాల కోసం గ్రామస్తులంతా వనభోజనాలకు వెళ్లే వింత ఆచారం అనంతపురం జిల్లాలో అనాదిగా వస్తోంది. కళ్యాణదుర్గం నియోజకవర్గం బోరంపల్లిలో వర్షాల కోసం పూర్వీకుల నుంచి గ్రామస్తులు వినూత్న ఆచారం కొనసాగిస్తూ వస్తున్నారు. మూకుమ్మడిగా ఇళ్ళ నుంచి బయలుదేరి ఊరు శివారులో వనభోజనాలకు వెళ్లడం కొనేళ్లుగా వస్తున్న ఆచారం.. ప్రతి ఇంటి నుంచి వంట సామాగ్రి తీసుకొని వస్తారు. తమ ఇంళ్లకు తాళాలు వేసుకుని.. మేళ తాళాలతో ఊరేగింపుగా గ్రామస్తులు వనభోజనాలకు వెళ్తారు.
ఊరి బయట ఆంజనేయస్వామి గుళ్లో ప్రత్యేక పూజలు చేసి.. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న వంట సామాగ్రితో అందరూ వంట సిద్ధం చేస్తారు. అనంతరం గ్రామస్తులంతా సహపంక్తి భోజనాలు చేస్తారు. ఇలా గ్రామస్తులంతా కలిసి వనభోజనాలు చేస్తే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని అక్కడి వారి నమ్మకం.
మళ్లీ సాయంత్రం ఊరేగింపుగా గ్రామస్తులంతా ఇళ్లకు చేరుకుంటారు. వర్షం కోసం గ్రామస్తులంతా ఐక్యమత్యంగా వనభోజనాలకు వెళ్లి.. సహపంక్తి భోజనాలు చేసే వింత ఆచారం ఎంతో ఆకర్షణగా ఉంది.




