సువిశాల సముద్ర తీరంతో పాటు ఎన్నో ప్రకృతి సహజసిద్ద వనరులు కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి పుష్కలమైన అవకాశాలున్నాయి. జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి నవంబర్ 27న లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరులు, విద్యుత్తు శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యెస్సో నాయక్ ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఆంధ్రప్రదేశ్ పవన విద్యుత్తు సామర్థ్యం గురించి వెల్లడించారు.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ (NIWE) రాష్ట్రంలో నిర్వహించిన అధ్యయనాల ప్రకారం భూ తలం నుంచి 120 మీటర్ల ఎత్తున గాలిమరలు ఏర్పాటు చేస్తే 74.9 గిగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చని గుర్తించింది. ఒకవేళ 150 మీటర్ల ఎత్తున వీటిని ఏర్పాటు చేస్తే ఏకంగా 123.33 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఆస్కారం ఉందని తేల్చింది. జల విద్యుత్తు, బొగ్గు ద్వారా ఉత్పత్తి చేసే థర్మల్ విద్యుత్ కేంద్రాల సామర్థ్యం మెగావాట్లలోనే ఉంటుంది. కానీ ఏకంగా 123 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన విద్యుత్తుకు ఉందంటే.. మొత్తం రాష్ట్ర అవసరాలు తీర్చడంతో పాటు యావద్దేశానికి కూడా సరఫరా చేయగలినంత అని అర్థం. ఈ ఏడాది ఏప్రిల్ 19న అత్యధికంగా 13,319 మెగావాట్లు (13 గిగావాట్లు) విద్యుత్తును ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంది. అది కూడా వేసవిలో అంత అత్యధిక డిమాండ్ ఏర్పడింది. ఈ లెక్కన చూసినా.. దీనికి దాదాపు 10 రెట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగే అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.
పవన విద్యుత్తు – తరిగిపోని ఇంధనం
పునరుత్పాదక ఇంధన వనరులు అనగానే ఎవరికైనా సౌర విద్యుత్ గుర్తుకొస్తుంది. సూర్యరశ్మి పుష్కలంగా లభించే భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సౌర విద్యుత్ కోసం ప్రోత్సాహకాలు, సబ్సిడీలు అమలు చేస్తున్నాయి. పైగా ఇంటి అవసరాలకు సరిపడా విద్యుత్తును స్వయంగా తయారు చేసుకునే వెసులుబాటు సౌర విద్యుత్తులో ఉంది. కానీ పునరుత్పాదక ఇంధన వనరుల్లో సౌర విద్యుత్‌తో పాటు పవన విద్యుత్తుకు కూడా విస్తారమైన అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా భారీ స్థాయిలో విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. ఇంకా చెప్పాలంటే సౌర విద్యుత్తు కేవలం పగలు సూర్యరశ్మి ఉన్నప్పుడు మాత్రమే ఉత్పత్తి చేయగలం. కానీ పవన విద్యుత్తుకు పగలు, రాత్రి తేడా లేదు.. గాలి వీస్తే చాలు కావాల్సినంత విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవచ్చు.
అయితే దీన్ని వ్యక్తిగత స్థాయిలో ఉత్పత్తి చేసుకోవడం సాధ్యం కాదు. పెద్ద పెద్ద గాలి మరలు వంటి భారీ నిర్మాణాలు అవసరమవుతాయి. అలా ఏర్పాటు చేస్తే నిరంతరం పెద్ద మొత్తంలో విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. ఇందుకు అనువైన ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో అర్థమవుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం పవన విద్యుత్తు ద్వారా 4.09 గిగావాట్ల సామర్థ్యంతో విద్యుత్తు అందుబాటులో ఉంది. ఇంకా 120 గిగావాట్ల వరకు ఈ సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..