
నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో నగదు కలకలం చెలరేగింది. శ్రీశైలం టోల్‌గేట్ వద్ద దేవస్థానం సెక్యూరిటీ, పోలీసు సిబ్బంది నిర్వహించిన వాహనాల తనిఖీల్లో 30 లక్షల రూపాయల లెక్కలు లేని నగదు అనుమానాస్పదంగా పట్టుబడింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో, ఆలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సెక్యూరిటీ సిబ్బంది, హోంగార్డులు క్షేత్రంలోకి ప్రవేశించే వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. ఈ తనిఖీల్లో మహారాష్ట్రకు చెందిన MH 11 DM 0589 నంబర్ గల కియా కారులో నగదు కట్టలతో కూడిన బ్యాగ్ బయటపడింది. వాహనంలో ఉన్న వ్యక్తులు తమది బంగారు వ్యాపారం అని, శ్రీశైలం దర్శనార్థం వచ్చామని తెలిపారు. అయితే నగదుకు సంబంధించిన సరైన ఆధార పత్రాలు చూపలేకపోవడం, వారి వివరణల్లో పొంతన లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు, శ్రీశైలం ఫస్ట్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు 30 లక్షల నగదు సహా కియా కారును స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. బంగారు వ్యాపారం చేస్తున్నామని చెప్పుకుంటున్నప్పటికీ, ఇంత భారీ మొత్తాన్ని నగదుగా తీసుకుని క్షేత్ర ప్రవేశం చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.