Chicken: సండే కదా అని చికెన్ తెస్తే ఎంత పనైంది..! కళ్ల ముందే ప్రాణాలొదిలిన పసివాడు..

|

Oct 28, 2024 | 11:37 AM

ఆదివారం చాలా మంది ఇళ్లల్లో చికెన్ తప్పనిసరి. మధ్య తరగతి కుటుంబీకులు అయితే కిలో చికెన్ తెచ్చుకుని చక్కగా వండుకుని భార్య పిల్లలతో కూర్చుని కడుపారా భుజిస్తారు. అయితే నిన్న ఆదివారం ఓ ఇంటిలో చికెన్ ముక్క అంతులేని విషాదం నింపింది. ఆడుతూపాడుతూ వచ్చీరాని మాటలతో అలరిస్తున్న చిన్నారి గొంతులో చికెన్ ముక్క ఇరుక్కుపోయి మృతి చెందిన ఘటన అన్నమయ్య జిల్లా రాజంపేటలో..

Chicken: సండే కదా అని చికెన్ తెస్తే ఎంత పనైంది..! కళ్ల ముందే ప్రాణాలొదిలిన పసివాడు..
Chicken
Follow us on

రాజంపేట, అక్టోబర్‌ 28: అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం మన్నూరులో విషాదం చోటు చేసుకుంది. ఆనందంగా ఇంట్లో బుడి బుడి అడుగులతో కేరింతలు కొడుతూ అప్పటి వరకూ కళ్లముందు ఆడుకుంటూ కనిపించిన చిన్నారి ఉన్నట్లుండి కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఏమైందో అర్ధంకాక తల్లిదండ్రులు హుటాహుటీన ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు యత్నించగా మార్గం మధ్యలోనే చిన్నారి అనంతలోకాలకు వెళ్లిపోయాడు. ఒక్కసారిగా బిడ్డ దూరమవడంతో కన్నపేగు తల్లడిల్లిపోయింది. విగతజీవిగా జీవిగా మారిన తమ బిడ్డ మృతదేహం ఒళ్లో పెట్టుకుని గగ్గోలు పెట్టారు. అసలేం జరిగిందంటే..

నంద్యాల జిల్లాకు చెందిన కృష్ణయ్య, మణి దంపతులు జీవనోపాధి కోసం రాజంపేట మండలం మన్నూరుకు కొంతకాలం క్రితం వలస వచ్చారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. నిన్న ఆదివారం కావడంతో కృష్ణయ్య, మణి దంపతులు ఇంట్లో చికెన్ వండారు. అనంతరం పిల్లలతోపాటు కలిసి అందరూ తిన్నారు. భోజనాల తర్వాత పనులకు వెళ్తేందుకు సిద్ధమవుతుండగా చిన్న కుమారుడు సుశాంక్‌ కిందపడిన చికెన్‌ ముక్కను నోట్లో వేసుకున్నాడు. సుశాంక్ దానిని తినేందుకు ప్రయత్నించగా.. అది పొరబాటున గొంతులో ఇరుక్కుపోయి ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.

ఏమైందోనని కంగారుపడిన తల్లిదండ్రులు బిడ్డను చేతుల్లోకి తీసుకోగా అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే 108లో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. మార్గం మధ్యలోనే సుశాంక్‌ మృతి చెందాడు. ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరిశీలించి.. సుశాంక్‌ గొంతులో చికెన్‌ ముక్క ఇరుక్కోవడంతో ఊపిరాడక మృతి చెందాడని నిర్ధారించారు. దీంతో అయ్యో ఎంత ఘోరం జరిగిపోయిందంటూ ఆ తల్లిదండ్రుల రోదన మిన్నంటింది. అప్పటి వరకు తమ కళ్ల ముందే ఆడుకున్న బాలుడు అంతలోనే విగతజీవిగా మారడంతో వారి రోదన చూపరులను కంటతడి పెట్టించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.