
మన భారత మహిళలకు బంగారం ఉంటే చాలు.. ఇంకేది అక్కర్లేదు.! మగువలకు బంగారం అంటే మక్కువ ఎక్కువ. ఇంకా చెప్పాలంటే విదేశీ బ్యాంకుల్లో ఉండే బంగారం కంటే.. మన మహిళామణుల దగ్గరే బోలెడన్ని టన్నుల బంగారం ఉంది. ఇక ఈ బంగారాన్ని అడ్డుగా పెట్టుకునే ఘరానా మామ.. కిలాడీ అల్లుడు మోసం చేశారు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. మరి ఆ వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా గాజువాకలో బంగారు ఆభరణాలకు మెరుగుపెడతామని అని చెప్పి.. సుమారు 24 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్ళారు మామఅల్లుళ్లు. స్థానికంగా నివాసముంటున్న ఓ మహిళను నమ్మించి.. మస్కా కొట్టారు. జూలై 15న స్టీల్ ప్లాంట్ మేనేజర్ భార్య అయిన సదరు మహిళతో మాటలు కలిపి.. ఆభరణాలకు మెరుగుపెడతామని నమ్మబలికించారు.
కట్ చేస్తే.. నగలతో ఊడాయించారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అన్నమయ్య జిల్లా పాత రాయచోటికి చెందిన రమణ, మారేడుమిల్లికి చెందిన నూకరాజుగా పిలవబడే మామ అల్లుళ్ళను అరెస్టు చేశారు దువ్వాడ క్రైమ్ పోలీసులు. వారి దగ్గర నుంచి 24 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.