Big News Big Debate: రసకందాయంలో ఏపీ పొత్తుల రాజకీయం..

|

Feb 08, 2024 | 7:05 PM

ఏపీలో పొత్తుల రాజకీయం... రసకందాయంలో పడ్డట్టు కనిపిస్తోంది. చంద్రబాబు ఢిల్లీ టూర్‌ తర్వాత కూడా.. విపక్ష కూటమిపై స్పష్టత రాకపోవడంతో మరోసారి ఈ అంశం ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటం.. రాజకీయంగా కొత్త చర్చకు దారితీసింది. ఇంతకీ ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోందనే ఉత్కంఠ ఏర్పడింది.

Big News Big Debate: రసకందాయంలో ఏపీ పొత్తుల రాజకీయం..
Big News Big Debate
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో రసపొత్తు రాజకీయం నడుస్తోందిప్పుడు. హాట్‌హాట్‌గా సాగుతున్న ఈ పొత్తుల అంశం.. ఢిల్లీకి చేరింది. కూటమి కట్టిన జనసేన, టీడీపీ… బీజేపీని కూడా జత చేసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఇదే అంశంపై ఢిల్లీవెళ్లి అమిత్‌షాతో సమావేశమైన చంద్రబాబు.. ఎటూ తేల్చకుండానే తిరిగివచ్చేశారు. అయితే, ఇద్దరు అగ్రనేతల మధ్య చర్చల సారాంశమేమిటన్నదే సస్పెన్స్‌గా మారింది.

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ మరోసారి భేటీ అయ్యాకే.. పొత్తుపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత మరోసారి పవన్‌ ఢిల్లీ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అప్పుడు పొత్తు మీద మరింత క్లారిటీ రావొచ్చంటున్నాయి జనసేన, టీడీపీ వర్గాలు. కాకపోతే, బీజేపీపెద్దలు చంద్రబాబుకు చెప్పిందేమిటి? పవన్‌ మరోసారి ఢిల్లీవెళ్లడానికి గల కారణమేంటి? అన్నదే ఇప్పుడు ఆసక్తిరేపుతోంది.

అసలు, కూటమితో బీజేపీ పొత్తు విషయంలో ఇంత జాప్యం ఎందుకు జరుగుతోంది? పీటముడి ఎక్కడ పడింది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సీట్ల విషయంలో పార్టీల మధ్యే ఏకాభిప్రాయం రాలేదా? లేక జనసేన, బీజేపీ అడుగుతున్న సీట్ల విషయంలో టీడీపీ డైలమాలో పడిందా? అనే చర్చ జరుగుతోంది.

బీజేపీతో జనసేన, టీడీపీ కూటమి .. చర్చలు జరుపుతున్న వేళ ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారవడం రాష్ట్ర రాజకీయాల్లో మరో చర్చకు కారణమైంది. మోదీతో పాటు కేంద్ర పెద్దలను కూడా జగన్‌ కలవనుండటంతో… ఏయే అంశాలు చర్చకు వస్తా యన్నది కీలకంగా మారింది. అమిత్‌ షాను చంద్రబాబు కలిసొస్తే… మోదీతో జగన్‌ భేటీ కాబోతుండటం ఆసక్తికర అంశంగా మారింది. ఇదంతా చూస్తుంటే ఏపీలో బీజేపీ.. రాజకీయంగా మాస్టర్‌ ప్లాన్‌ ఏదో వేసి ఉండొచ్చనేవారూ లేకపోలేదు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..