అప్పుడే కళకళలాడుతున్న రిజర్వాయర్లు..! రైతులకు ఇక ఢోకా లేనట్టే..!
ఈ ఏడాది ఖరీఫ్ పంటలకు తుంగభద్ర, శ్రీశైలం రిజర్వాయర్లు సమృద్ధిగా నీటిని నిల్వ చేసుకున్నాయి. తుంగభద్ర డ్యామ్ 50 శాతం, శ్రీశైలం 90 శాతం నిండి ఉంది. గేట్ల సామర్థ్యం పరిమితం అయినప్పటికీ, ముందస్తుగా వచ్చిన వర్షాలతో రైతులకు సాగునీటికి భరోసా కలిగింది.

ఈ ఏడాది రైతులకు రిజర్వాయర్లు భరోసా ఇస్తున్నాయి. ఖరీఫ్ ప్రారంభంలోనే ఇంకా ఋతుపవనాలు ప్రారంభం కాకముందే ప్రధాన రిజర్వాయర్లలోకి వరద నీరు రావడం పట్ల ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భరోసా వచ్చినట్లుగా ఫీల్ అవుతున్నారు. సీమ రైతులకు అత్యంత కీలకంగా ఉన్న కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ ఇప్పటికే 50 శాతం నిండింది. డ్యాం గేట్ల నాణ్యత పై నిపుణులు ఆందోళన వ్యక్తం చేయడం, 80 టీఎంసీలకు మించి నీటి నిలువ చేయవద్దని ఆదేశాలు ఇవ్వడంతో రైతుల్లో ఆందోళన చెందారు. 105 టీఎంసీల సామర్థ్యం ఉన్న తుంగభద్ర డ్యామ్ లో గేట్ల సామర్థ్యం తగ్గడంతో 80 టీఎంసీలకే పరిమితం చేయాలని నిర్ణయించారు.
దీంతో ఆయకట్టు కూడా తగ్గుతుందేమో అని ఆందోళన వ్యక్తం అవుతుంది. అయినప్పటికీ చాలా ముందుగానే ప్రాజెక్టులోకి నీరు రావడం, అతి త్వరలోనే పంటలకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటంతో రైతులలో ఈసారి పంటలకు భరోసా వచ్చినట్లయినది. అదే విధంగా మరో ప్రధాన శ్రీశైలం రిజర్వాయర్ లోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కృష్ణ పరివాహక జూరాల ప్రాజెక్టు నుంచి 58,372 క్యూసెక్కులు, తుంగభద్రా నది నుంచి మరో 2200 క్యూసెక్కులు.. మొత్తం ఈ రోజు 60,587 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం డ్యాంకు వచ్చి చేరుతుంది. దీంతో డ్యాం నీటిమట్టం కూడా పెరుగుతోంది.
215 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశైలం రిజర్వాయర్ ప్రస్తుతం 90 టీఎంసీలతో కళకళలాడుతోంది. శ్రీశైలం రిజర్వాయర్ 854 లెవెల్ దాటడంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటి విడుదలకు మార్గం సుగమం అయింది. ఎగువ నుంచి నీటి ప్రవాహం కొనసాగుతూ ఉండటంతో ఇక సాగు తాగు నీటికి భరోసా వచ్చినట్లే. అయితే విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే మరికొన్ని రోజులు వరద ప్రవాహం కొనసాగాల్సిందే. ఏది ఏమైనాప్పటికీ అటు తుంగభద్ర ఇటు కృష్ణా నదిలో నుంచి వరద ప్రవాహం ఖరీఫ్ ఆరంభంలోనే ప్రధాన ప్రాజెక్టులకు నీరు రావడం పట్ల రైతులు సంతోషంగా ఉన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి




