దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూ కల్తీ వ్యవహారంపై తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు స్పందించారు. శ్రీవారి లడ్డూ నాణ్యతపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలోనే ల్యాబ్ టెస్టులు నిర్వహించామని తెలిపారు. నాసిరకం నెయ్యి కారణంగానే లడ్డూ ప్రసాదం నాణ్యత లోపించిందని ఈవో స్పష్టం చేశారు.
తిరుమల ప్రసాదంలో వాడుతోంది నెయ్యా, నూనె అనే అనుమానాలు రావడంతో సరఫరాదారులకు వార్నింగ్ ఇచ్చామన్నారు టీటీడీ ఈవో శ్యామల రావు. కల్తీ పరిశీలనకు 75లక్షలతో ఏర్పాటు చేయగల ల్యాబ్ కూడా ఏర్పాటు చేయలేదని, గతంలో సరైన పరీక్షలు చేయకపోవడంతో సరఫరాదారులు కల్తీ చేసే అవకాశమిచ్చారని శ్యామల రావు స్పష్టం చేశారు. అలాగే, గతంలో సాధ్యంకానీ ధరలకు ప్రసాదం నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చారని, 220 నుంచి 410 రూపాయలకు ఎలా కాంట్రాక్ట్ ఇచ్చారో అర్ధం కాలేదని టీటీడీ ఈవో శ్యామల రావు అన్నారు. తక్కువధరకు కొనడం వల్ల నాణ్యతపై కంట్రోల్ ఉండదని ఇంత తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేయడం సాధ్యం కాదని ఆయన అన్నారు.
AR డెయిరీ కంపెనీ సరఫరా చేసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యి క్వాలిటీ లేదని గుర్తించి ఫస్ట్‌టైమ్ టీటీడీ బయట ల్యాబ్‌కు శాంపిల్స్ పంపామని టీటీడీ ఈవో శ్యామల రావు క్లారిటీ ఇచ్చారు. 320 రూపాయలకు కల్తీ నెయ్యి మాత్రమే వస్తుందని అర్ధమయిందని, గుజరాత్‌లోని NDDB కాఫ్ ల్యాబ్‌కు శాంపిల్స్ పంపించామని ఆయన అన్నారు. శాంపిల్స్ పరీక్షల్లో 90శాతానికి పైగా క్వాలిటీ ఉండాల్సిన నెయ్యి 20శాతం కూడా క్వాలిటీ లేదని తేలిందన్నారు టీటీడీ ఈవో. సోయా, సన్‌ఫ్లవర్ సహా అనేక ఆయిల్స్ మిక్స్ అయ్యాయని, పిగ్ స్కిన్ ఫ్యాట్, అనిమల్ ఫ్యాట్స్ కూడా నెయ్యిలో ఉన్నట్టలు తేలిందన్నారు. దీంతో సరఫరాదారుడిని వెంటనే బ్లాక్‌లిస్ట్‌లో పెట్టామని, న్యాయపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నామని శ్యామల రావు స్పష్టం చేశారు.
తిరుమల శ్రీవారికి పెట్టే నైవేద్యంలో మే నుంచి మార్పులు చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. గతంలో ఆర్గానిక్ ఆవు నెయ్యి, బియ్యం, బెల్లం ఓ సంస్థ నుంచి తీసుకున్నారని వాటి వల్ల ప్రసాదం నాణ్యత తగ్గిందని ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీంతో నిపుణుల కమిటీ ద్వారా పరీక్షలు చేయిస్తున్నామని శ్యామలరావు అన్నారు. ప్రస్తుతం నైవేద్యానికి వాడుతున్న సేంద్రీయ పదార్థాలను కూడా తాత్కాలికంగా నిలిపివేశామని ఆయన అన్నారు. కల్తీ పరీక్ష కోసం బయటకు పంపడం టీటీడీ చరిత్రలో ఇదే తొలిసారి అని ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..