Parvathipuram Manyam: గిరిజనుల కష్టం పరులపాలు.. సీతాఫలాలకు గిట్టుబాటు ధరలేక ఇక్కట్లు!!

| Edited By: Srilakshmi C

Nov 08, 2024 | 11:33 AM

అడవినే నమ్ముకున్న గిరిజనులు ఆయా కాలాల్లో అడవిలో దొరికే

Parvathipuram Manyam: గిరిజనుల కష్టం పరులపాలు.. సీతాఫలాలకు గిట్టుబాటు ధరలేక ఇక్కట్లు!!
Organic Custard Apples
Follow us on

విజయనగరం, నవంబర్ 8: గిరిజనులు అధికంగా ఉండే జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా. ఈ జిల్లాలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండటంతో గిరిజనులు కూడా అటవీ ఉత్పత్తులను సేకరించి జీవనోపాధి పొందుతుంటారు. అలా సేకరించే ఉత్పత్తుల్లో పసుపు, చింతపండుతో పాటు పలు రకాల కాయగూరలు, పండ్లు ఉంటాయి. వాటిలో ఒక ప్రధానమైన ఉత్పత్తి సీతాఫలం. ఇక్కడ పండే సీతాఫలాలకు చాలా డిమాండ్ ఉంటుంది. రుచికి తీయగా ఉండటంతో పాటు కెమికల్స్ కలవకుండా సహజసిద్ధంగా పండటంతో వీటిని తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు సీతాఫల ప్రియులు. ఇవి సీజనల్ గా ఆగస్టు నుండి అక్టోబర్ వరకు అటవీ ప్రాంతంలో దొరుకుతుంటాయి. ఆ సమయంలో వాటిని సేకరించి వారపు సంతల్లో విక్రయిస్తుంటారు గిరిజనులు.

అలా ఎంతో కష్టపడి సేకరించిన సీతాఫలాలను గిరిజనులు సంతల్లో తక్కువ ధరకే అమ్ముతారు. సంతల్లోని వ్యాపారులు వద్ద నుండి కూడా మైదాన ప్రాంత వ్యాపారులు తక్కువ ధరకే కొనుగోలు చేస్తారు. అలా ఇక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసిన సీతాఫలాలను పట్టణాల్లో అధిక ధరకు విక్రయిస్తారు వ్యాపారులు. కెమికల్స్ లేని ఆర్గానిక్ కావడంతో మైదాన ప్రాంతంలో వీటికి అధిక గిరాకీ ఉంటుంది. ఈ సీతాఫలాల్లో విటమిన్ ఏ, బి, సి, కె, ప్రోటీన్, కాల్షియం, పాస్పరస్, మెగ్నీషియం, కాఫర్, ఫైబర్, ఐరెన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా యాంటి ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల క్యాన్సర్ రాకుండా దోహద పడుతుంది. సీతాఫలం తినడం వల్ల కంటి చూపు మెరగవ్వడంతో పాటు జుట్టు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంలో చెడు కొలస్ట్రాల్ ను బయటకు పంపి అధిక బరువును తగ్గిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న సీతాఫలాల పై అవగాహన ఉన్న నగరవాసులు వీటిని తినేందుకు అధికంగా ఆసక్తి చూపుతుంటారు.

అలాంటి సీతాఫలాలు ఎంతో కష్టపడి సేకరించి వారపు సంతల్లో తక్కువ ధరకు విక్రయిస్తున్నారు గిరిజనులు. వీరి వద్ద సేకరించిన సీతాఫలాలు నగరంలో అత్యధిక ధరకు దళారులు విక్రయిస్తున్నారు. ఈ సీతాఫలాలు మన్యం జిల్లా నుండి ఒడిశాలోని భువనేశ్వర్, కటక్, పూరి, పర్లాకిమిడితో పాటు పలు పట్టణాలకు ఎగుమతి అవుతుంటాయి. ప్రస్తుతం ఒక ట్రే ధర ఏడు వందల నుండి తొమ్మిది వందల వరకు ధర పలుకుతుంది. అయితే తక్కువ ధరకు విక్రయిస్తూ మోసపోతున్న గిరిజనులను మద్దతు ధర కల్పించి, ప్రభుత్వమే కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు గిరిజనులు. గిరిజన ప్రాంతంలో సీతాఫల సాగు విస్తీర్ణం పెంచడంతో పాటు ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రోత్సాహకాలు కల్పించి యువతకు, స్థానిక గిరిజనులకు ఉపాధి కల్పించాలని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.