నీటి చుక్క కోసం మైళ్లదూరం నడక ప్రయాణం.. మోకాళ్లపై కూర్చొని వినూత్న నిరసన..

| Edited By: Srikar T

May 20, 2024 | 5:33 PM

వేసవిలో నగరాలే కాదు.. మారుమూల కొండ కోనల్లో నివసించే ఆదివాసీలకూ తాగునీటి కష్టాలు తప్పడం లేదు. కనీస సౌకర్యాలు లేక.. తాగు నీటి కోసం కిలోమీటర్లు నడిచి నీటి చలమలపై ఆధారపడుతున్నారు కొంతమంది గిరిజనులు. మోకాళ్ళపై నిలుచుని ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. దాహం తీర్చండి మహాప్రభో అంటూ నినదించారు. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ ఎగువగుడ్డి గ్రామస్థులు ఖాళీ బిందెలతో మెకాళ్లపై నిల్చుని ఆందోళన చేపట్టారు.

నీటి చుక్క కోసం మైళ్లదూరం నడక ప్రయాణం.. మోకాళ్లపై కూర్చొని వినూత్న నిరసన..
Alluri District
Follow us on

వేసవిలో నగరాలే కాదు.. మారుమూల కొండ కోనల్లో నివసించే ఆదివాసీలకూ తాగునీటి కష్టాలు తప్పడం లేదు. కనీస సౌకర్యాలు లేక.. తాగు నీటి కోసం కిలోమీటర్లు నడిచి నీటి చలమలపై ఆధారపడుతున్నారు కొంతమంది గిరిజనులు. మోకాళ్ళపై నిలుచుని ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. దాహం తీర్చండి మహాప్రభో అంటూ నినదించారు. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ ఎగువగుడ్డి గ్రామస్థులు ఖాళీ బిందెలతో మెకాళ్లపై నిల్చుని ఆందోళన చేపట్టారు. రొంపిల్లి పంచాయితీ ఎగువ గుడ్డి గ్రామంలో 12 కుటుంబాల్లో 70 మంది జనాభా నివాసం ఉంటున్నారు. ఆ ప్రాంత గిరిజనులకు తాగునీటి కష్టాలు మామూలుగా ఉండటంలేదు.

ఈ గ్రామంలో జల్ జీవన్ మిషన్ ద్వారా మంచినీటి పథకం ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కుళాయిల ద్వారా కనీసం చుక్కనీరు రావడం లేదు. దీంతో దాహం తీర్చేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో ఊరికి దూరంగా ఉన్న చెలమనీటిపై ఆధారపడాల్సి వస్తుందంటున్నారు. అలంకారప్రాయంగా ఉన్న కుళాయిల వల్ల ప్రజాధనం దుర్వినియోగం అయింది తప్ప ఎటువంటి ప్రయోజనం లేదని చెబుతున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఎగువగుడ్డి గ్రామానికి మంచి నీటి సమస్య పరిష్కారం చూపాలని చేతులు జోడించి ప్రాధేయపడుతున్నారు. దీనిపై సత్వరం స్పందించాలని జిల్లా కలెక్టర్, అధికారులను వేడుకుంటూ మోకాళ్లపై నిల్చోని ఖాళీ బిందెలు నెత్తిన పెట్టుకొని వినూత్న నిరసన తెలిపారు. ఇప్పటికైనా తమ సమస్యను తీర్చలని ఆదివాసి గిరిజన మహిళలు కోరారు. తక్షణమే మంచి నీటి సమస్య పరిష్కారం చేయకపోతే.. పంచాయతీ సచివాలయం వద్ద కాళీ బిందెలతో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.