AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో సంచలన ఘటన.. ఉద్యోగానికి దరఖాస్తు చేసేందుకు వెళ్లిన గిరిజన యువతి…

పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన యువతి బిడ్డిక ఉషారాణి దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఉద్యోగ దరఖాస్తు కోసం ఇంటి నుంచి వెళ్లిన ఆమె కనిపించకుండా పోగా, తుమరాడ సమీపంలోని చెరువులో చేతులు, కాళ్లు కట్టి మృతదేహంగా లభ్యమైంది. కేసును హత్యగా నమోదు చేసిన పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఏపీలో సంచలన ఘటన.. ఉద్యోగానికి దరఖాస్తు చేసేందుకు వెళ్లిన గిరిజన యువతి...
Usharani
S Srinivasa Rao
| Edited By: |

Updated on: Jun 12, 2026 | 8:29 AM

Share

ఇంటి నుంచి బయటకు వెళ్లిన కుమార్తె క్షేమంగా తిరిగి ఇంటికి చేరే వరకు తల్లిదండ్రులు ఆందోళన చెందే రోజులు ఇవి. అలాంటి విషాదకర ఘటన తాజాగా పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది. పాలకొండ మండలం బర్న సీతంపేటకు చెందిన గిరిజన యువతి బిడ్డిక ఉషారాణి (32) దారుణ హత్యకు గురైంది. పాలకొండ మండలంలోని తుమరాడ సమీపంలో చింతాడకు వెళ్లే రహదారి పక్కన ఉన్న చెరువులో ఆమె మృతదేహం లభ్యమైంది. దుండగులు ఉషారాణి చేతులు, కాళ్లను తాళ్లతో కట్టి, శరీరానికి బండరాయి కట్టి చెరువులో పడేసినట్లు గుర్తించారు. చెరువులో కొంత భాగం తేలియాడుతూ కనిపించిన మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్ద మాజీ ఎమ్మెల్యే కళావతి, గ్రామస్తులు, గిరిజన సంఘాల నాయకులు, వామపక్ష నాయకులు భారీ సంఖ్యలో చేరుకుని నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఉషారాణి డిగ్రీతో పాటు బీఈడీ పూర్తి చేసింది. ఈ నెల 6వ తేదీన ఉద్యోగానికి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు చేసేందుకు పాలకొండకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరింది. ఆమెను బడ్డుమాసింగి జంక్షన్ వరకు తమ్ముడు బైక్‌పై తీసుకెళ్లాడు. అక్కడ తన స్నేహితురాలు వస్తుందని, ఆమెతో కలిసి పాలకొండ వెళ్తానని చెప్పి తమ్ముడిని వెనక్కి పంపించింది. ఆ తర్వాత నుంచి ఉషారాణి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు ఆమెకు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ స్విచ్ ఆఫ్ వస్తుండటంతో ఆందోళన చెందారు. బంధువులు, పరిచయస్తుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో బుధవారం ఉదయం పాలకొండ పోలీస్ స్టేషన్‌లో ఆమె కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అయితే అదే రోజు సాయంత్రం తుమరాడ చెరువులో ఓ మహిళ మృతదేహం లభ్యమైందన్న సమాచారం పోలీసులకు అందింది. ఉషారాణి మిస్సింగ్ కేసు నేపథ్యంలో కుటుంబ సభ్యులను పిలిపించి మృతదేహాన్ని చూపించగా, అది ఉషారాణిదేనని వారు గుర్తించారు. కుమార్తె మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉషారాణి విద్యావంతురాలని, భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమెను హత్య చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఘటనతో మిస్సింగ్ కేసును పోలీసులు హత్య కేసుగా మార్చారు. కాల్ డేటా, ఇతర సాంకేతిక ఆధారాల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఉషారాణి హత్యతో బర్న సీతంపేట గ్రామంతో పాటు పరిసర గిరిజన ప్రాంతాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Follow Us