Andhra: రామ డోలి ఉత్సవం గురించి తెల్సా..? 50 అడుగుల ఎత్తు ఊయలలో బాలలను ఊపుతారు..

అరకు లోయలో గిరిజన సాంప్రదాయ రామ డోలి ఉత్సవం ఘనంగా జరిగింది. గిరిజన ఆచార వ్యవహారాలు ప్రతిబింబించేలా వేడుక నిర్వహించారు. పూర్వికుల కాలంనాటి ఆచార వ్యవహారాలకు విలువనిస్తూ సాంప్రదాయాలను గౌరవిస్తూ సాగిన ఈ ఉత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి గిరిజనులు భారీగా హాజరయ్యారు. ఏడేళ్లకోసారి బస్కీలో రామడోలి ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది..

Andhra: రామ డోలి ఉత్సవం గురించి తెల్సా..? 50 అడుగుల ఎత్తు ఊయలలో బాలలను ఊపుతారు..
Rama Doli Utsavam Araku

Edited By:

Updated on: Jan 14, 2026 | 3:53 PM

అల్లూరి జిల్లా అరకులోయ మండలం బస్కి గ్రామంలో రామ డోలి వేడుకలు నిర్వహిస్తారు. ఏడేళ్ల కోసారి నిర్వహించే ఉత్సవాల వెనుక.. ప్రాచీన కథ ఉంది. పూర్వం ఒడిస్సాలోని ఒండ్రుగడ్డ అనే గ్రామంలో ఈ వేడుకలు జరిగేవి. ఈ పండుగను పుష్ పోరబ్ అని ఒడియాలో అంటారు. ధనలక్ష్మీ రూపంలో ఉన్న పాడిపంటలను ఇంటికి తెస్తున్న సందర్భంగా ఒడిశాలో ఇలా ఉత్సావం నిర్వహించడం ఆనవాయితీ. ప్రస్తుతం ఉన్న అల్లూరి జిల్లాలోని అరకులోయ గతంలో ఒడిస్సాలో కలిసి ఉండేది. బస్కివాసులు.. రామ డోలి ఉత్సవాల్లో పాల్గొనేవారు. కాలక్రమమైన ఆ ఉత్సవాన్ని ఇప్పుడు బస్కీ లో గిరిజనులు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు.

బాలలను గుహలో పెట్టి నిష్టతో..

ఈ వేడుకలో భాగంగా.. ఆనాటి రాముడి చరిత్ర, జీవిత గాధను ప్రతిబింబించేలా ఉత్సవాలు నిర్వహిస్తారు. పదేళ్ల లోపు వయసున్న నలుగురు బాలలను రామలక్ష్మణ భరత శత్రుజ్ఞులుగా ముస్తాబు చేస్తారు. ఉత్సవాల ముందు రోజు నుంచి ఓ గుహలో ఆ నలుగురు బాలలను ఉంచి పూజలు చేస్తారు. ఈ సందర్భంగా బాలలంతా నిష్టతో ఉపవాసం చేస్తారని బస్కికి చెందిన బాలదేవ్ చెప్పారు..

మరుసటి రోజు పండుగను సాంప్రదాయ బద్ధంగా… వేడుకగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే మంగళవారం నాడు గుహలో ఉన్న ఆ నలుగురు బాలలను మేళ తాళాలతో.. రామ డోలి నిర్వహించే ప్రాంతానికి తీసుకువచ్చారు. ఆ తర్వాత పూజా కార్యక్రమాలు నిర్వహించి.. నలుగురు బాలలను 50 అడుగుల ఎత్తులో కట్టిన ఊయలలో ఊపారు.

ఆ ఊయలకు ప్రత్యేకత..

వాస్తవానికి ఈ భారీ ఎత్తులో ఉన్న ఈ ఊయల వెనుక కూడా ప్రత్యేకత ఉంది. ఊయలకు కట్టే ఎత్తైన మానులను.. మామిడి కలలను వినియోగిస్తారు. ఏడేళ్ల క్రితం ప్రత్యేకంగా పూజలు చేసి ఆ చెట్లను పెంచుతారు. ఆ చెట్టు కలపనే ఈ ఉత్సవాలకు వినియోగించడం ఆనవాయితీ అన్నారు బస్ కి గ్రామ పెద్ద రామారావు.

ఇలా వేడుకలు నిర్వహించడం వల్ల.. తమ గ్రామానికి అరిష్టం తొలగి.. పాడి పంటలు పుష్కలంగా పండి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని నమ్మకం. బస్కీలో జరిగిన రామడోలి ఉత్సవానికి.. వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున గిరిజనులు హాజరయ్యారు. ఉత్సాహంగా దింసా నృత్యాలతో ఆడి పాడారు. సంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..