Andhra Pradesh: నంది పొట్టలో వజ్రాలు ఉన్నాయంటూ ప్రచారం.. కట్ చేస్తే.. ఏకంగా గొయ్యి తీసి.!

| Edited By: Venkata Chari

Oct 21, 2023 | 9:25 PM

పూరాతన ఆలయాలు భారతీయ సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంపదకు ఆనవాళ్ళు. అలాంటి చరిత్ర కలిగిన ఆలయాలపై గుప్త నిధుల వేటగాళ్లు కళ్ళు పడుతున్నాయి. ఆలయాల్లో విలువైన వజ్రాలు, బంగారం ఉంటుందని భావించి తవ్వకాలు చేపడుతూ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. గుప్తనిధుల వేటలో ఆలయ సంపదను కొల్లగొడుతున్నారు. ఇటీవల ప్రకాశంజిల్లా నాగులుప్పలపాడు మండలం కనపర్తిలో గుప్తనిధుల వేటగాళ్ళు రెచ్చిపోయారు.

Andhra Pradesh: నంది పొట్టలో వజ్రాలు ఉన్నాయంటూ ప్రచారం.. కట్ చేస్తే.. ఏకంగా గొయ్యి తీసి.!
Andhra Pradesh
Follow us on

Andhra Pradesh: నందీశ్వరుడు శివుని అవతారం అంటారు.. నందిని ద్వితీయ శంభుడు అని కూడా అంటారు.. నంది కేవలం శివుని వాహనంగానే కాకుండా శివుడికి సంబంధించిన ఇతర ముఖ్యమైన బాధ్యతలు కూడా నిర్వహిస్తాడంటారు. నంది శివుని అంతరంగికుడు. శివుని అంతరంగ గదిలోకి ఎప్పుడైనా వెళ్ళే అనుమతి కేవలం నందికి మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా శివుడ్ని దర్శించుకోవాలంటే ముందు నందీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవాలంటారు. అంతటి ప్రాధాన్యమున్న నంది పొట్టలో వజ్రాలు ఉంటాయని గత కొన్నేళ్ళుగా ప్రచారం జరుగుతుండటంతో గుప్తనిధుల వేటగాళ్ళ కళ్ళు నంది విగ్రహాల మీద పడ్డాయి. దీంతో శివాలయాల్లోని నంది విగ్రహాలను ధ్వంసం చేసి వజ్రాలు వెతికే ముఠాలు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి.

ఈ క్రమంలో తాజాగా రెండు రోజుల క్రితం ప్రకాశంజిల్లా బెస్తవారిపేట మండలం పిట్టికాయగుళ్ళ గ్రామంలోని శివాలయంలో గుప్త నిధుల వేటగాళ్ళు తవ్వకాలు జరిపారు. గ్రామ సమీపంలోని పిటికేశ్వర ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. పిటికేశ్వర ఆలయ ఆవరణలోని నంది విగ్రహం కింద గుప్తనిధుల కోసం తవ్వకాలు చేశారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయంలో గతంలో కూడా గుప్తనిధుల కోసం గుర్తుతెలియని వ్యక్తులు అన్వేషించారు. మళ్ళీ కొంతమంది గుప్త నిధుల వేటగాళ్ళు నంది విగ్రహాన్ని ధ్వంసం చేసి కడుపులో వజ్రాల కోసం వెతికారు. అయితే వారికి ఎలాంటి వజ్రాలు దొరకలేదు. దీంతో నంది విగ్రహం కింద భాగంలో ఉంటాయన్న అనుమానంతో నంది విగ్రహాన్ని పెకిలించి చూశారు. అయినా వజ్రాలు దొరకలేదు. దీంతో అక్కడినుంచి గుప్తనిధుల వేటగాళ్ళు పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చరిత్ర కలిగిన దేవాలయాన్ని సంరక్షించాలని స్థానిక ప్రజలు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.

కనపర్తిలో పేలుడు పదార్ధాలతో నంది విగ్రహాన్ని పేల్చిన ఘనులు..

పూరాతన ఆలయాలు భారతీయ సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంపదకు ఆనవాళ్ళు. అలాంటి చరిత్ర కలిగిన ఆలయాలపై గుప్త నిధుల వేటగాళ్లు కళ్ళు పడుతున్నాయి. ఆలయాల్లో విలువైన వజ్రాలు, బంగారం ఉంటుందని భావించి తవ్వకాలు చేపడుతూ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. గుప్తనిధుల వేటలో ఆలయ సంపదను కొల్లగొడుతున్నారు. ఇటీవల ప్రకాశంజిల్లా నాగులుప్పలపాడు మండలం కనపర్తిలో గుప్తనిధుల వేటగాళ్ళు రెచ్చిపోయారు. గ్రామంలోని పురాతన శివాలయంలో బీభత్సం సృష్టించారు. క్రీస్తూ శకం రెండో శతాబ్దంనాటి ఏలేశ్వరస్వామి పేరుతో ఉన్న శివాలయంలో గుప్త నిధుల కోసం దుండగులు విఫలయత్నం చేశారు. గర్భగుడికి ఎదురుగా ఉన్న నందిశ్వరుని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. నందిశ్వరుని పొట్టలో వజ్రాలు ఉంటాయన్న నమ్మకంతో ధ్వంసం చేసినట్టు కనిపిస్తోంది. నందిశ్వరునికి రెండు రంధ్రాలు వేసి ఆ రంధ్రాల్లో జిలెటిన్‌ స్టిక్స్‌ పెట్టి పేల్చివేశారు. ఈ దుశ్చర్యతో గ్రామంలో అలజడి నెలకొంది. మరోవైపు నంది విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామంలోని భక్తులు ఆందోళనకు దిగారు. వెంటనే నిందితులను పట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. చివరకు పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి కటకటాలవెనక్కినెట్టారు. కనపర్తిలో గుప్తనిధులు ఉన్నాయన్న అనుమానంతో దేవాలయాలను టార్గెట్‌ చేస్తుండటంతో గ్రామంలో రక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..