అన్నమయ్య జిల్లా, జూలై 26: మదనపల్లె మార్కెట్‌లో టమోటా ధరలు రికార్డు సృష్టిస్తున్నాయి. ఇవాళ మదనపల్లె మార్కెట్‌లో కిలో నాణ్యమైన టమోటా ఏకంగా రూ. 168 పలికింది. ఏపీలోని అతిపెద్ద టమోటా మార్కెట్‌గా ఉన్న మదనపల్లె మార్కెట్‌లో టమోటా ధరలు అంతకంతకూ పెరుగుతూ జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. నిన్న రూ. 140 పలికిన కేజీ టమోటా.. ఇవాళ ఏకంగా రికార్డు స్థాయిలో రూ.168కి చేరింది. ఈ మార్కెట్‌లో మొదటి రకం టమోటా ధర కిలో రూ. 140-168, రెండో రకం రూ. 118-138 వరకు ఉంది. అలాగే మూడో రకం టమోటా కిలో ధర రూ 118 నుంచి 130 వరకు పలుకుతోంది. మార్కెట్‌కు 361 మెట్రిక్ టన్నుల టమోటాను రైతులు మార్కెట్‌కు తీసుకురావడంతో.. మొదటి రకం టమోటాకు భారీగా డిమాండ్ పెరిగింది. కాగా, నిన్నటివరకు రూ.140 పలికిన నాణ్యమైన టమోటా.. ఇప్పుడు రూ.168కి చేరుకోవడంతో రైతుల్లో ఆనందం వ్యక్తం అయింది.