తిరుమల లడ్డూలో నెయ్యి నాణ్యతపై మొదలైన వివాదం, ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. లడ్డూ నాణ్యత, నెయ్యి కల్తీ, టీటీడీ పవిత్రత, డిక్లరేషన్ ఇలా సాగిన రాజకీయ వివాదాలు.. జగన్ తిరుమల పర్యటనదాకా వచ్చాయి. ఈ క్రమంలో డిక్లరేషన్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. నిన్నటి దాకా మాజీ సీఎం తిరుమల పర్యటన చుట్టూ తిరిగిన డిక్లరేషన్ ఇష్యూ.. ఇప్పుడు యూ టర్న్ తీసుకుంటోందా అన్న అనుమానం వ్యక్తమవుతోంది.. ఇందుకు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలే కారణం. జగన్ ను ఎప్పుడూ డిక్లరేషన్ అడగని టీటీడీ ఇప్పుడెందుకు అడుగుతుందని ప్రశ్నించారు నారాయణస్వామి.. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ డిక్లరేషన్ విషయం లేవనెత్తడం చర్చకు దారితీసింది. తిరుమల వస్తోన్న పవన్ నుంచి కూడా టీటీడీ డిక్లరేషన్ తీసుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు.
గత 5 ఏళ్లు శ్రీవారికి పట్టువస్త్రాలు ఇచ్చిన జగన్ ప్రధాని మోదీతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నప్పుడు డిక్లరేషన్ అడగలేదని నారాయణస్వామి పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని జగన్ ఆచరించినట్లు ఎవరూ పాటించలేదన్నారు. పవన్ కళ్యాణ్ క్రిస్టియన్స్ అని ఆయనే చెప్పారని నారాయణస్వామి గుర్తు చేశారు. రష్యన్ ను పెళ్లి చేసుకున్నానని, తన కుటుంబం బాప్టిజం తీసుకుందని గతంలో పవన్ కల్యాణే స్వయంగా చెప్పారంటూ నారాయణస్వామి పేర్కొన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన నారాయణస్వామి.. పవన్ కళ్యాణ్ పై తాము నిందలు వేయడం లేదని, గతంలో ఆయన అన్న మాటలే గుర్తుచేస్తున్నామన్నారు. దేవుడే లేడని తన తండ్రి అనే వారని పవన్ చాలా సార్లు చెప్పిన మాటలు విన్నామని వివరించారు.
సనాతన ధర్మాన్ని ఆచరించే వారు చెప్పులతో వెళతారా అని ప్రశ్నించారు నారాయణ స్వామి. పవన్ ఉదయం పూజలు చేశారు, సాయంత్రం షూటింగ్ కు వెళ్ళారని.. ప్రజలకు సేవ చేయడమంటే సినిమా లాంటిది కాదని నారాయణ స్వామి ఆరోపించారు. కులాలు, మతాలు, పార్టీలు తనకు లేవని హిందువులే రెచ్చగొట్టి ఇలాంటివి చేస్తున్నారని గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన విషయాలను నారాయణస్వామి గుర్తు చేశారు.
ఈ క్రమంలో.. తిరుమలకు వస్తున్న పవన్ కళ్యాణ్ ను డిక్లరేషన్ ఇవ్వమని బీజేపీ, టీడీపీ నేతలు అడుగుతారా..? అంటూ సవాల్ చేశారు. సోనియా డిక్లరేషన్ ఇచ్చే తిరుమలకు వచ్చారా..? అని ప్రశ్నించారు. హిందువులు ఏ మతాన్ని ద్వేషించిన సందర్భం లేదని.. తిరుమల వస్తోన్న పవన్ నుంచి కూడా టీటీడీ డిక్లరేషన్ తీసుకోవాలంటూ వైసీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి డిమాండ్ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..