తిరుపతి: తిరుమలలో కొలువైన శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది భక్తులు తరలివస్తుంటారు. మొక్కుబడులున్నవారు కొందరు కాలినడకన వస్తే, మరికొందరేమో వాహనాల్లో వచ్చి తమ మొక్కులను తీర్చుకుంటుంటారు. ఐతే తాజాగా ఓ యువకుడు మాత్రం భరతనాట్యం చేస్తూ నడక మార్గంలో తిరుమల ఆలయానికి చేరుకున్నాడు. వివరాల్లోకెళ్తే..
పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన డాక్టర్ పి కృష్ణవాసు శ్రీకాంత్ అనే వ్యక్తి భరతనాట్య కళాకారుడు. పల్నాడులోని శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం కోటప్పకొండ విద్యాలయంలో కృష్ణవాసు సంస్కృత అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. భరత నాట్య కళాకారుడైన కృష్ణవాసు బుధవారం (జులై 12) తిరుమలకు వెళ్లాడు. ఐతే నడుచుకుంటూ కాదు.. భరతనాట్యం చేసుకుంటూ వెళ్లాడు. శ్రీవారి మెట్టు మార్గం నుంచి కేవలం 75 నిమిషాల్లోనే అన్నమయ్య, త్యాగయ్య కీర్తనలకు నృత్యం చేస్తూ తిరుమల చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. సాధారణంగా మెట్టుమార్గంలో నడుస్తూ వెళ్తే గంటన్నర సమయం పడుతుంది. నృత్యాన్ని భక్తులకు పరిచయం చేసే ప్రయత్నమని, అందుకే నృత్యం చేస్తూ వచ్చానని ఆయన వివరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.