తిరుమలలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆస్థాన మండపంలో 3 రోజులు పాటు ఈ ధార్మిక సదస్సు జరిగింది. సదస్సులో స్వామీజీలు చేసిన సూచనలు, సలహాలపై పలు తీర్మానాలు చేశారు. సదస్సు ముగింపు తర్వాత TTD చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆ వివరాల్ని మీడియాకు వెల్లడించారు. మొత్తం 19 కీలక నిర్ణయాలను తీసుకున్నట్టు భూమన తెలిపారు. 62 మంది పీఠాధిపతులు ఈ సదస్సులో పాల్గొన్నారని వివరించారు. హిందూ మతంలో చేరాలనుకునేవారికి పవిత్ర జల సంప్రోక్షణ ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నట్టు భూమన తెలిపారు.
ఈ సదస్సుకు వచ్చిన పలువురు స్వామీజీల ఏకకంఠ అభిప్రాయాన్ని అనుసరించి… వేరే మతస్థులెవరైనా హిందూమతంలోకి మారడానికి శ్రద్ధతో ఇష్టపడుతూ వస్తే… వారిని పవిత్రజల ప్రోక్షణంతో స్వాగతం పలుకుతారు. ఇతర మతస్తులు స్వచ్ఛందంగా హిందూ మతాన్ని స్వీకరించేందుకు ఒక వేదికను తిరుమలలో ఏర్పాటు చేయాలని కూడా పీఠాధిపతులు సదస్సులో నిర్ణయించారు. దేశంలో మరేచోట ఇలాంటి వేదిక లేదని అన్నారు. తిరుమల తరహాలో తిరుపతిలోనూ ఆధ్యాత్మికత పుట్టిపడేలా తీర్చిదిద్దేందుకు సదస్సులో తీర్మానం చేశారు. యువకులలో ధార్మిక భావాన్ని పెంచేందుకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. ద్రవిడ వేదానికి ప్రాచూర్యం కల్పించేలా ఏర్పాట్లు చేశామని.. పాఠశాల విద్యార్థులకు హైందవ ధర్మం ఆవశ్యకత తెలిసేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సోషల్ మీడియా ద్వారా హిందూ ధార్మిక కార్యక్రమాలను ప్రచారం చేసేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. తిరుపతిని కూడా తిరుమల తరహాలో ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..