
తిరుమల అన్నమయ్య భవనంలో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పాలకమండలి సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బోర్డు సభ్యులతో పాటు ఈవో ముద్దాడ రవిచంద్ర అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం బోర్డు నిర్ణయాలను వెల్లడించిన టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు.. 82 అంశాలపై చర్చించినట్లు తెలిపారు. వేసవిలో ఏర్పాట్లు, భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తిరుమలలో వీధులకు పేర్లు మార్పు చేస్తామని ఈ మేరకు 51 పేర్లు నిర్ణయించామన్నారు.
తిరుమలలోని ఆళ్వార్ ట్యాంక్ కూడలి నుంచి బాలగంగమ్మ కూడలి వరకు టాయిలెట్సె నిర్మాణానికి రూ 4.54 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు స్పష్టం చేశారు. గోగర్భం డ్యామ్ నుంచి ఫిల్టర్ హౌస్ వరకు రూ 6 కోట్లతో పైప్ లైన్లు, రూ 44.2 కోట్లతో ఏపీకి చెందిన ఆప్కో, తమిళనాడుకు చెందిన కోఆపటెక్స్ సంస్థల నుంచి పట్టువస్త్రాలు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ చెప్పారు.
తిరుమలలో వరాహస్వామి విశ్రాంతి భవనం ఆధునీకరణ కు రూ 3.6 కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలోని శ్రీవారి ఆలయంలో నూతన మండపాల నిర్మాణానికి రూ 36.9 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పష్టం చేశారు. ఖమ్మంలో తెలంగాణ ప్రభుత్వం టీటీడీకి కేటాయించిన 20 ఎకరాల స్థలంలో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించాం. రాతి రథమండపం పై చర్చించాం త్వరలో నిర్ణయం ప్రకటిస్తామన్నారు టీటీడీ ఛైర్మన్.