తిరుమల శ్రీవారి భక్తులకు భక్తులకు అలెర్ట్.. చంద్ర గ్రహణం కారణంగా మంగళవారం (నవంబర్ 8)న ఉదయం 8.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచనున్నారు. రేపు బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. దీంతో 7న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. మంగళవారం మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. ఈ కారణంగా మంగళవారం ఆర్జిత సేవలు, శ్రీవాణి, సర్వదర్శనం టోకెన్ల పంపిణీ, రూ.300 దర్శన టికెట్లను కూడా నిలిపివేయనున్నట్లు టీటీడీ తెలిపింది. చంద్ర గ్రహణం ముగిసిన తర్వాత సంప్రోక్షణ, ప్రదోష కాలపు పూజలు నిర్వహించి ఆలయ తలుపులు తిరిగి తెరుస్తారు. వైకుంఠం-2 క్యూ కాంప్లెక్స్ ద్వారా భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.
మంగళవారం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇతర ప్రాంతాల్లో కూడా అన్నప్రసాద వితరణ ఉండదు. గ్రహణం పూర్తైన తర్వాత రాత్రి 8.30 గంటల నుండి భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభమవుతుంది. శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకారించాలని టీటీడీ అధికారులు సూచించారు. శ్రీవారి ఆలయంతో పాటు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవ స్థానం, వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం, సింహాచలం అప్పన్న స్వామి గుడి కూడా రేపు మూతపడనున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.