Tirumala News: శ్రీవారి సర్వదర్శనం టోకెన్‌ కేంద్రాల వద్ద తోపులాట.. పలువురు భక్తులకు గాయాలు

Tirumala News: తిరుమల తిరుపతి (Tirumala Tirupati)లో శ్రీవారి సర్వదర్శన టోకెన్ల విషయంలో భక్తుల తోపులాట జరిగింది. టోకెన్ల కోసం భక్తులు..

Tirumala  News: శ్రీవారి సర్వదర్శనం టోకెన్‌ కేంద్రాల వద్ద తోపులాట.. పలువురు భక్తులకు గాయాలు
Follow us
Subhash Goud

|

Updated on: Apr 12, 2022 | 12:07 PM

Tirumala News: తిరుమల తిరుపతి (Tirumala Tirupati)లో శ్రీవారి సర్వదర్శన టోకెన్ల విషయంలో భక్తుల తోపులాట జరిగింది. టోకెన్ల కోసం భక్తులు భారీగా ఎగబడటంతో తోపులాట జరిగింది. రెండురోజులుగా టోకెన్ల పంపిణీ నిలిపివేయడంతో భక్తులు తిరుపతిలో వేచి ఉన్నారు. తిరిగి ఈ రోజు మళ్లీ సర్వదర్శనం టోకెన్ల (Sarvadarshana tokens) కౌంటర్లు ఓపెన్‌ కావడంతో భక్తులు భారీగా వచ్చారు. టోకెన్ల కోసం చిన్న పిల్లలు సైతం క్యూలైన్‌లో నిల్చుని ఇబ్బందులకు గురయ్యారు. రెండు రోజుల అనంతరం గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌ వద్ద టోకెన్లు పంపిణీ జరిగింది. అయితే గోవిందరాజస్వామి సత్రం వద్ద వేచి ఉన్న భక్తులతో పాటు ఈ రోజు కూడా భక్తులు భారీ ఎత్తున క్యూలైన్‌లోకి రావడంతో ఈ తోపులాట జరిగింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. టీటీడీ విజిలెన్స్‌ పోలీసులు చర్యలు చేపట్టినా.. భక్తుల తోపులాటను నిలుపలేకపోయారు. ఈ తోపులాటలో కొందరు గాయపడటంతో వారికి చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. టోకెన్‌ల కోసం భక్తులు బారులు తీరడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఒకరిపై ఒకరు తోసుకోవడంతో కొందరు భక్తులకు గాయాలు అయ్యాయి. పిల్లలకు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. క్యూలైన్‌లో ఉన్న కొందరు భక్తులు సొమ్మసిల్లిపడిపోయారు.

బ్లాక్‌లో అధిక ధరలకు టికెట్లు అమ్ముతున్నారు..

కాగా, టోకెట్ల జారీ విషయంలో బ్లాక్‌లో అధిక ధరలకు టికెట్లను అమ్ముకుంటున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. టోకెట్ల పంపిణీ విషయంలో సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

భక్తుల అధిక రద్దీ ఎఫెక్ట్‌

తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల పంపిణీలో భక్తుల తోపులాట జరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు రోజుల పాటూ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అధిక రద్దీ కారణంగానే టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

భక్తులను నేరుగా తిరుమలకు అనుమతి: టీటీడీ

అధిక రద్దీ కారణంగా భక్తులను నేరుగా తిరుమలకు అనుమతిస్తున్న టీటీడీ తెలిపింది. టోకెన్ కేంద్రాల వద్ద టోకన్ అవసరం లేకుండా తిరుమలకు వెళ్లచ్చని టీటీడీ సిబ్బంది ప్రకటించింది. ఈ రోజు ఎలాంటి టోకెన్లు అవసరం లేకుండా భక్తులను అనుమతిస్తామని తెలిపింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీడీ వెల్లడించింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అడిషనల్‌ అడిషనల్ సీవీఎస్వో శివకుమార్ రెడ్డి తెలిపారు.

ఇక అధిక రద్దీ కారణంగా బుధవారం నుండి ఆదివారం వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు చేయడం జరిగిందని టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరింది.

ఇవి కూడా చదవండి:

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఈనెల 14 నుంచి 3 రోజులు వార్షిక వసంతోత్సవాలు .. ఆ సేవలను రద్దు చేసిన టీటీడీ

EPFO Update: మీ పీఎఫ్‌ అకౌంట్‌లో మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ, పుట్టిన తేదీని అప్‌డేట్‌ చేయడం ఎలా..?