Tirumala Temple: తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. ఎవరు, ఎంతిచ్చారంటే..?

|

Dec 25, 2024 | 4:35 PM

TTD Donations: తిరుమల శ్రీవారికి భారీగా విరాళాలు అందుతున్నాయి. గత మూడు రోజుల వ్యవధిలోనే ఇద్దరు భక్తులు రూ.2 కోట్ల విరాళాలను టీటీడీకి అందజేశారు. తాజాగా బుధవారంనాడు రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఈఓ శ్రీ పి.ఎం.ఎస్‌.ప్రసాద్ బుధవారం టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.1,11,11,111 విరాళంగా అందజేశారు.

Tirumala Temple: తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. ఎవరు, ఎంతిచ్చారంటే..?
Ttd Donations
Follow us on

తిరుమల శ్రీవారికి రెండ్రోజుల వ్యవధిలోనే భారీ విరాళాలు అందాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఈఓ శ్రీ పి.ఎం.ఎస్‌.ప్రసాద్ బుధవారం టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.1,11,11,111 (ఒక కోటి పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు రూపాయలను) విరాళంగా అందించారు. ఈ మేరకు విరాళం డీడీని శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి చెక్ అందజేశారు.

సోమవారంనాడు సూర్య పవన్ కుమార్ అనే భక్తుడు టీటీడీ అన్న ప్రసాదం ట్రస్ట్‌కు రూ.1,00,10,116 విరాళాన్ని అందజేశారు. టీటీడీ ఈవో జే శ్యామల రావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరికి తిరుమలలో విరాళాన్ని అందజేశారు.

రూ.1 కోటి విరాళం అందజేసిన శ్రీవారి భక్తుడు సూర్య పవన్ కుమార్..

జనవరి 7న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 2025 జనవరి 10 నుండి 19వ తేదీ వరకు పది రోజుల వైకుంఠ ఏకాదశి ద్వార ద‌ర్శ‌నాలను పుర‌స్క‌రించుకుని జనవరి 7వతేదీ మంగళవారంనాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంది. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

జనవరి 7వ ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. ఈ సమయంలో స్వామివారి మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంత‌రం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

జనవరి 7వ తేది కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేయడంతో 6వ తేది సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీకి సహకరించాల్సిందిగా భక్తులకు టీటీడీ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.