Tirumala Darshan Tickets : తిరుమల వెంకన్న భక్తులకు అలర్ట్.. రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల
2025 జనవరికి సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను ఈ నెలలో టీటీడీ అందుబాటులోకి తేనుంది. ఇదిలా ఉంటే,.. ఇటీవల కురుస్తున్న వర్షాలతో తిరుమల గిరులు ప్రకృతి అందాలను సంతరించుకున్నాయి. శేషాచలం కొండలు మంచు తెరలు కప్పుకొని కనువిందు చేస్తున్నాయి.
కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి దర్శనభాగ్యం కోసం ప్రపంచ నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివస్తుంటారు. నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో స్వామివారి దర్శనమే కాకుండా ఆయనకు సేవ చేసే భాగ్యాన్ని కూడా టీటీడీ కల్పించింది. ఈ మేరకు భక్తుల సౌకర్యార్థం కోసం 2025 జనవరికి సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను ఈ నెలలో టీటీడీ అందుబాటులోకి తేనుంది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి 2025 జనవరి కోటాను అక్టోబర్ 19న ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం అక్టోబరు 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ ప్రకటించింది. ఈ టికెట్లు పొందిన భక్తులు అక్టోబర్ 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి. కాగా కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను అక్టోబర్ 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
ఈ వీడియోపై క్లిక్ చేయండి..
ఇదిలా ఉంటే,.. ఏపీలో జోరుగా కురుస్తున్న వర్షాలతో తిరుమల గిరులు ప్రకృతి అందాలను సంతరించుకున్నాయి. శేషాచలం కొండలు మంచు తెరలు కప్పుకొని కనువిందు చేస్తున్నాయి. ఘాట్ రోడ్లపై ప్రయాణించే భక్తులు వాహనాలు ఆపి ప్రకృతి అందాన్ని ఆస్వాదిస్తున్నారు. కొండపైన జలపాతం వద్ద నీటి ఉధృతి అధికంగా ఉండటంతో టీటీడీ సిబ్బంది భక్తులను అనుమతించడం లేదు. పచ్చదనం విచ్చుకున్న ప్రకృతి అందాల నడుమ తిరుమల వెంకన్న దర్శనానికి భక్తులు క్యూ కడుతున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..