పల్లెల్లో నాటుబాంబులు కలకలం సృష్టిస్తున్నాయి. కొందరు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రహస్య ప్రాంతాల్లో వీటిని దాచుతుంటే.. మరికొన్ని చోట్ల అడవి పందుల నుంచి తప్పించుకునేందుకు వేటగాళ్లు వీటిని పొలాల్లో అమర్చుతున్నారు. అయితే ప్రమాదవశాత్తూ ఇవి మనుషులు, మూగజీవాల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. తాజాగా చిత్తూరు (Chittoor) జిల్లాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎస్ఆర్ పురం మండలంలో నాటు బాంబు తిని ఆవు మృతి చెందింది. కటిక పల్లి గ్రామంలో అడవి జంతువుల బారి నుంచి పంటలను కాపాడుకునేందుకు వేటగాళ్లు అమర్చిన నాటుబాంబును ఆవు నమలడంతో నోట్లోనే అది పేలిపోయింది. దీంతో గోమాత ముఖం, నాలుక సహా ముందుభాగమంతా చిధ్రమైపోయాయి. రక్తమోడుతూ కొద్ది సేపు మృత్యువుతో పోరాడినప్పటికీ ప్రాణాలు మాత్రం దక్కలేదు.
కటిక పల్లి గ్రామానికి చెందిన రాజేంద్రన్ అనే రైతుకు చెందిన పాడి ఆవు మేత కోసం గ్రామ శివారులోని అటవీ ప్రాంతానికి వెళ్లింది. అయితే అడవి జంతువుల కోసం ఉంచిన నాటు బాంబును నోటితో నమిలడంతో ముఖం తునాతునకలైంది. తీవ్రంగా రక్తస్రావం కావడంతో సంఘటనా స్థలంలోనే మృతిచెందింది. కాగా పాలిచ్చే ఆవు మృతి చెందడంతో అన్నదాత రాజేంద్రన్ లబోదిబోమంటున్నాడు. ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లాలో నాటుబాంబులు పేలి మూగజీవాలు ప్రాణాలు కోల్పోవడం పరిపాటిగా మారిపోయింది. గతంలో వెదురుకుప్పం, పెద పంజాని, శాంతిపురం మండలాల్లోనూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.