Central Minister Kishan Reddy: తిరుపతి నుంచి జన ఆశీర్వాద యాత్ర ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ నుంచి జన ఆశీర్వాద యాత్ర ప్రారంభించారు. తిరుపతికి చేరుకున్న కేంద్ర మంత్రి.. ఆర్టీసీ బస్టాండ్ ముందున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జన ఆశీర్వాద
Jan Ashirwad Yatra: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ నుంచి జన ఆశీర్వాద యాత్ర ప్రారంభించారు. తిరుపతికి చేరుకున్న కేంద్ర మంత్రి.. ఆర్టీసీ బస్టాండ్ ముందున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జన ఆశీర్వాద యాత్రను షురూ చేశారు. ఈ యాత్రలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, టీజీ వెంకటేష్, బీజేపీ ముఖ్య నేతలు వెంట ఉన్నారు. రైల్వే స్టేషన్, నేతాజీ రోడ్ గాంధీ రోడ్డు మీదుగా తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం కూడలికి జన ఆశీర్వాద యాత్ర జరిగింది.
కాగా, కేంద్రం అమలు చేస్తున్న కార్యక్రమాలు వివరిస్తూనే.. కేంద్రమంత్రి అయిన తర్వాత జనం ఆశీర్వాదం తీసుకునేందుకు కిషన్ రెడ్డి ఈ యాత్ర చేపట్టారు. ఏపీలో రెండు రోజులు.. తెలంగాణలో మూడు రోజుల పాటు సాగనుందీ యాత్ర. కేంద్రంలో బీజేపీ పాలన ఏడేళ్లు పూర్తైన సందర్భంగా కిషన్ రెడ్డి యాత్ర చేపట్టారు. రేపు ఉదయం కిషన్ రెడ్డి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటారు. అనంతరం విజయవాడలో అమ్మవారి దర్శనం చేసుకుని కోదాడకు బయలుదేరుతారు. తిరుపతి, విజయవాడ పార్లమెంట్ నియోజక వర్గాల్లో కిషన్ రెడ్డి యాత్ర సాగనుంది. రేపు సాయంత్రం 4 గంటలకు కోదాడ తిరుమలపూర్ గ్రామం చేరుకుంటారు. రాత్రి సూర్యాపేటలో బస చేస్తారు.
20న దంతాలపల్లి, తొర్రూరు, రాయపర్తి, వర్ధన్నపేట మీదుగా వరంగల్‌లోకి ప్రవేశిస్తారు. అక్కడ భద్రకాళి మాతను దర్శనం చేసుకుని వరంగల్, హన్మకొండలో తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. వరంగల్‌లో టీకా కేంద్రాన్ని కూడా పరిశీలిస్తారు. ఆ తర్వాత సర్వాయి పాపన్న గ్రామమైన ఖిలాషాపూర్.. అక్కడి నుంచి జనగామ, ఆలేరుకు చేరుకుంటారు.
అక్కడ పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశంను కలుస్తారు. అనంతరం యాదాద్రి చేరుకుని లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకుంటారు. ఆ రాత్రి యాదాద్రిలోనే బస చేస్తారు. 21న ఉదయం భువనగిరిలో రేషన్ దుకాణంలో బియ్యం పంపిణీని పరిశీలిస్తారు. ఆ తర్వాత ఘట్‌కేసర్, ఉప్పల్ మీదుగా నాంపల్లిలో పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు. యాత్ర మధ్యలో అక్కడక్కడ మొత్తం 40 చోట్ల సభలకు ఏర్పాట్లు చేశారు కమలనాథులు. యాత్రలో భాగంగా సేంద్రియ వ్యవసాయంలో జాతీయ అవార్డు గ్రహీతను కోదాడలో సన్మానిస్తారు.