Fact Check: తిరుమల కొండపై అసలు ఏం జరిగింది.. నటి అర్చనా గౌతమ్ ఆరోపణల్లో నిజమెంత..?

తిరుమల కొండపై బాలీవుడ్‌ నటి అర్చనా గౌతమ్‌ చేసిన రచ్చ.. ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. దీనిపై సీఎం ఆఫీసు కూడా వివరాలు సేకరించి.. ఎవరిది తప్పు ఉందనే అంశంపై ఫ్యాక్ట్ చెక్ చేసింది.

Fact Check: తిరుమల కొండపై అసలు ఏం జరిగింది.. నటి అర్చనా గౌతమ్ ఆరోపణల్లో నిజమెంత..?
Actress Archana Gautam

Updated on: Sep 05, 2022 | 9:28 PM

ఏడుకొండలవాడి స్పెషల్‌ దర్శన్‌ అంటేనే వెరీ వెరీ పెసల్‌. స్వామిని దగ్గర్నుంచి దర్శించుకోవాలని.. ఆ భాగ్యం తమకు కలగాలని ఎంతగానే ఆరాటపడుతుంటారు భక్తులు. అయితే, కొండమీద బాలీవుడ్‌ నటి అర్చన గౌతమ్‌ చేసిన తాజా రచ్చతో… ఈ స్పెషల్‌ దర్శనం వ్యవహారం మరోసారి వివాదానికి కేంద్రబిందువుగా మారింది. అర్చన చేసిన రచ్చ అలాంటి మరి. అర్చన ఉత్తరాదిలో ప్రముఖ నటి. అటు సినిమాల్లో, ఇటు సీరియల్స్‌లో చేస్తూ సెలబ్రిటీగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు, పొలిటికల్‌ ఎంట్రీ కూడా ఇచ్చేసింది. కాంగ్రెస్‌ తరపున గతంలో పోటీచేసి ఓడిపోయింది. అదే పలుకుబడితో, కేంద్రమంత్రి నారాయణస్వామి సిఫార్సు లెటర్‌తో… వెంకన్న స్వామి దర్శనం కోసం వచ్చింది. కానీ, టీటీడీ సిబ్బంది ఆమెను అడ్డుకోవడం వివాదానికి కారణమైంది. దీంతో, నానా హంగామా సృష్టించింది అర్చన. దీనికి కారణమేదైనా.. ఈ ఎపిసోడ్‌ ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమై కూర్చుంది.

తిరుమల కొండపై ఈవో కార్యాలయంలో అర్చనాగౌతం ఆందోళనకు దిగడం ఒకెత్తయితే… అక్కడ టీటీడీ సిబ్బంది వ్యవహరించిన తీరు.. దానికి ఆమె కన్నీటి పర్యంతమైన తీరు… చర్చనీయాంశమైంది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాకు ఎక్కడంతో మేటర్‌ సీరియస్‌ అయ్యింది. ఎంతైనా మహిళ… ఓ సెలబ్రిటీ హోదాలో ఎంతో దూరం నుంచి స్వామి దర్శనానికి వచ్చింది. అలాంటి వ్యక్తిని పట్టుకుని ఇలా ఏడిపిస్తారా? అనే యాంగిల్‌ వివాదం వేడెక్కింది. అంతేకాదు, దర్శనం కోసం తన దగ్గర పదివేల రూపాయలు డిమాండ్‌ చేశారని అర్చన పేల్చిన బాంబు… మరింత అగ్గిని రాజేసింది.

వ్యవహారం సామాజిక మాద్యమాల్లో మార్మోగుతుండటంతో.. టీటీడీ రంగంలోకి దిగింది. అసలు జరిగింది ఇదీ… అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అందులో, టీటీడీ సిబ్బంది తప్పిదం ఏమీ లేదనీ… అంతా రూల్‌ ప్రకారమే వ్యవహరించారనీ స్పష్టం చేసింది. వినాయకచవితినాడు జరిగిన గొడవకు సంబంధించిన వీడియోని.. ఆమె తాజాగా పోస్ట్ చేసిందని చెబుతోంది. అంతేకాదు, ఆమెకు కేంద్రమంత్రి సిఫార్సు చేసిన లేఖలో.. ఆగస్టు 30న దర్శనం టిక్కెట్‌ బుక్కై ఉంది. కానీ, ఆమె మాత్రం ఆగస్టు 31న వచ్చింది. ఒకరోజు ఆలస్యంగా రావడంతో.. ఆ లేఖను తిరస్కరించామనీ టీటీడీ చెబుతోంది. ఆమె తీసుకొచ్చిన లేఖకు సమయం ముగిసిపోవడంతోనే బ్రేక్ దర్శనం ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఆమెకు 300 రూపాయల ప్రత్యేక దర్శనం అవకాశం కల్పించామనీ.. అయినప్పటికీ ఆమె, టీటీడీ సిబ్బందితో వాగ్వాదానికి దిగిందని టీటీడీ తెలిపింది.

పదివేల రూపాయలు అడిగారంటూ అర్చన చేసిన హాట్‌ అలిగేషన్స్‌పై స్పష్టత ఇచ్చింది టీటీడీ. అయితే, ఆమె తెచ్చిన సిఫార్సు లేఖకు సమయం అయిపోవడంతో… శ్రీవాణి ట్రస్టు ద్వారా 10 వేల రూపాయలు చెల్లించి బ్రేక్ దర్శనం తీసుకోవాలని ఆఫర్‌ ఇచ్చినట్టు టీటీడీ సిబ్బంది చెబుతున్నారు. అలా చెప్పినప్పటికీ.. ఆమె వినిపించుకోలేదనీ చెప్పారు. తనను డబ్బులు అడుగుతున్నారంటూ.. అడిషనల్ ఈఓ కార్యాలయంలో రభస సృష్టించారనీ.. దాన్ని వీడియో రికార్డ్ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారని టీటీడీ తెలిపింది. అంతేకాదు, గుజరాత్ కు వస్తే మిమ్మల్ని నరికేస్తా… అంటూ అర్చనా గౌతమ్ బెరిరించిందని టీటీడీ సిబ్బంది ఆరోపిస్తున్నారు. సూపరింటెండెంట్ చాంబర్ లోకి దూరి సిబ్బందిపై చేయి చేసుకున్నారని కూడా ఉద్యోగులు చెబుతున్నారు.

దీనిపై టీటీడీ మరోసారి క్లారిటీ ఇస్తూ ప్రకటన విడుదల చేసింది. అర్చనతో పాటు మరో ఏడుగురు వ్యక్తులు.. కేంద్ర మంత్రి సిఫార్సుతో దర్శనం కోసం వచ్చారనీ.. అయితే, అప్పటికే గడువు ముగిసిపోవడంతో సిబ్బంది అంగీకరించలేదని తెలిపింది. ప్రత్యేక దర్శనం టిక్కెట్లు మంజూరు చేస్తామని చెప్పినా వినిపించుకోలేదని వివరించింది. పైపెచ్చు అద‌న‌పు ఈవో కార్యాల‌యంలోకి చొచ్చుకువచ్చి నానా రచ్చ చేసిందని.. తమ సిబ్బందిపై ఆమె దాడి చేసినట్లు TTD తెలిపింది.  సోషల్‌ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తూ… టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ఇలాంటి అవాస్తవాల్ని భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.